YS Jagan files writ petition to restore security cover | అమరావతి: వ్యక్తిగత భద్రత విషయంపై ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తనకు గతంలో ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం తన భద్రతపై ఏకపక్షంగా వ్యవహరించి, సెక్యూరిటీని తొలగించిందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం కనీసం పరిశీలించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కండీషన్ కూడా సరిగా లేదని తన పిటిషన్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.


వైసీపీ అధినేత సోమవారం నాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3, 2024 వరకు ఉన్న భద్రతను తిరిగి పునరుద్ధరించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తనకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతను తగ్గించడంపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 


జూన్ 4న ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆశ్చర్యకరంగా నెల రోజుల్లోనే తన భద్రతను 59కి తగ్గించారని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. భద్రత కుదింపుపై తనకు  ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అమలు చేశారని పిటిషన్‌లో స్పష్టం చేశారు. సహజ ప్రక్రియకు విరుద్ధంగా భద్రత తగ్గింపునకు సంబంధించి నోటీసు సైతం ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.