Leopard In Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. రాజమండ్రి శివారు లాలాచెరువు సమీపంలోని దూరదర్శన్‌, ఆలిండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పంది వెనుక మాటు వేసి వెళ్తూ దానిపై దాడికి పాల్పడిన దృశ్యాలను బమ్మూరు పోలీసులకు దూరదర్శన్‌ సిబ్బంది అందజేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అటవీ అధికారులు చిరుత కదలికలు గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. 2 కెమెరాల్లో పులి సంచరిస్తోన్న ఫోటోలు రికార్డయ్యాయని.. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే చిరుత సంచారం ఉన్నట్లు తెలిపారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని.. అవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని వెల్లడించారు. 


'అప్రమత్తంగా ఉండండి'


రాజమండ్రి దివాన్‌చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు లాలాచెరువు, దివాన్‌చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో లభ్యమైన పాద ముద్రలను బట్టి చిరుతపులిగా నిర్ధారించినట్లు డీఎఫ్‌వో దృవీకరించారు. ముఖ్యంగా స్వరూప్‌‌నగర్‌, పద్మావతినగర్‌, రూప్‌నగర్‌, శ్రీరామ్‌నగర్‌, తారకరామానగర్‌, ఏపీ హౌసింగ్‌ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రిపూట ఎవ్వరూ ఆరుబయట కూర్చొవద్దని, బయటకు రావాల్సి వస్తే వెంట టార్చ్‌లైట్‌ తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. చిన్న పిల్లల్ని ట్యూషన్లుకు చీకటి పడిన తరువాత పంపవద్దని, పిల్లల్ని బయట ఆడుకోనివ్వద్దని హెచ్చరించారు.


'ఈ నెంబరుకు కాల్ చేయండి'


ఇప్పటివరకు మనుషులపై ఎటువంటి దాడి జరగలేదని, త్వరలోనే చిరుతను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు డీఎఫ్‌వో వెల్లడించారు. అనుమానం ఉన్నచోట్ల ట్రాప్‌ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిరుతకు సంబందించిన సమాచారం ఏమన్నా తెలిస్తే 18004255909 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరోవైపు, చిరుత సంచారంతో రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దివాన్‌చెరువు సమీప ప్రాంతంలో భయం భయంగా గడుపుతున్నారు. పులి సంచారం చేస్తున్న ప్రాంతాలుగా భావిస్తున్న చోట దండోరా వేయించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలు చోట్ల ఫెక్సీ బ్యానర్లును ఏర్పాటు చేశారు. 


అడ్డతీగల నుంచి దారితప్పి..


రాజమండ్రి శివారు ప్రాంతాలకు ముఖ్యంగా చిరుత పులులు దారితప్పి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. రాజమండ్రి శివారు ప్రాంతంలోని దివాన్‌చెరువును ఆనుకుని దూరంలో అడ్డతీగల రిజర్వు ఫారెస్ట్‌ ఉండగా అక్కడి నుంచే తరచూ చిరుత పులులు దారి తప్పి ఇటువైపుగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదైనా జంతువును వేటాడే క్రమంలో దారి తప్పి ఇలా జనావాసాల్లోకి చొరబడతాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 2008లో స్థానిక లలితానగర్‌లోకి ఓ చిరుత పులి చొరబడి తీవ్ర అలజడి రేపింది. ఓ బాత్రూమ్‌లో నక్కి ఉండడంతో గమనించిన స్థానికులు బాత్‌రూమ్‌ గడియపెట్టి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. 2011లో ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ బేస్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో ప్రవేశించిన చిరుత పులి ఓ పెంపుడు కుక్కపై దాడి చేసింది. చివరకు బోనులు ఏర్పాటు చేసి దాన్ని బంధించారు. ఇదే ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌లో 2018లోనూ రెండు చిరుత పులులు చొరబడగా వాటిని బోన్లు ద్వారా ఫారెస్ట్‌ అధికారులు బందించారు. 


Also Read: AP Floods: ఏపీలో వరద నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం - శాఖల వారీగా నష్టం వివరాలివే!