Foreigners Devotees Dance In Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda) పట్టణంలో ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అహోబిలం ఇస్కాన్ ఆధ్వర్యంలో రష్యన్ ఇస్కాన్ భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అహోబిలం ఇస్కాన్ మందిరం నిర్వాహకులు చంద్రకేశవదాస్ ప్రభు ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడు, రాధాదేవి  విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. హరే రామ.. హరే కృష్ణ.. అంటూ విదేశీ భక్తుల భజనలు , కీర్తనలు చేస్తూ స్ధానిక 4 రోడ్ల కూడలి వరకు ఊరేగింపులో పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్, సైబీరియాకు చెందిన విదేశీ భక్తులు నృత్యాలు ఆళ్లగడ్డ పురవీధుల్లో అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.



ప్రపంచవ్యాప్తంగా శ్రీ కృష్ణ చైతన్యం వెళ్లి విరుస్తోందని తిరుపతి ఇస్కాన్ మందిరం నిర్వాహకులు చైతన్య ప్రభు అన్నారు. రష్యా, ఉక్రెయిన్, సైబీరియాకు చెందిన 80 మంది భక్తులు నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ భక్తులు శ్రీకృష్ణ చైతన్యాన్ని దశదిశలా చాటుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అహోబిలం, ఆళ్లగడ్డ ప్రాంతాలకు కూడా రష్యన్ ఇస్కాన్ భక్తులు వచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిలం ఇస్కాన్ మందిరం నిర్వాహకులు చంద్రకేశవ దాస్ ప్రభు కూడా పాల్గొన్నారు.


Also Read: Viral Video: సంతలో కూరగాయల్లా మద్యం అమ్మకం - వైరల్ వీడియో, ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు