కార్పొరేషన్ల పేరుతో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను దారి మళ్లించిన స్కాం కొన్నాళ్ల క్రితం కలకలం రేపింది. తెలంగాణలో పలు బ్యాంకుల అధికారులు మోసగాళ్లతో కలిసి ప్రభుత్వ కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టిన నిధుల్లో ఏపీకి సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి నేరాలు బయటపడుతున్నాయి.  ఇటీవల కాలంలో రెండు వెలుగులోకి వచ్చినట్లుగా ఏపీ ఆర్థిక శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ. 9.60 కోట్ల రూపాయలను ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. అయితే ఇప్పుడా నిధులు లేవు. దాదాపుగా ఈ మొత్తం నిధులు బ్యాంకు నుండి విత్‌డ్రా అయ్యాయి. 


వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పేరుతోనే కరెంటు ఖాతా ఏర్పాటు చేసి, దాని ద్వారా నిధులు తరలించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.  కరెంటు ఖాతాకు సంబంధించి తాము ఎటువంటి ప్రతిపాదన చేయలేదని, అసలు ఆ వ్యవహారం తమ దృష్టిలోనే లేదని వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు అంటున్నారు. ఈ ఖాతాను ఎవరు తెరిచారు.. ఎవరు నిధులు తరలించారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ అంశంపై బ్యాంకుతో కలిసి ఆర్థిక శాఖ అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నట్లుగా తెలు్సతోంది.   బ్యాంకులు, సంస్థ ఉద్యోగుల పాత్ర ఉందా అన్నదానిపై వివరాలు ఆరా తీస్తున్నారు.  


ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాత్రమే కాకుండా..  రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ సంస్థలో కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసినట్లు ఆర్ధికశాఖలో ప్రచారం జరుగుతోంది.  ఈ సంస్థ ఐదు కోట్ల రూపాయలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా బ్యాంకులో వేసింది. అయితే సంస్థకు తెలియకుండానే ఈ నిధులు విత్ డ్రా అయ్యాయి.  ఈ డిపాజిట్‌కు సంబంధిరచిన నకిలీ రసీదులు సంస్థకు అందాయి.. ఒరిజినల్‌ డిపాజిట్‌ ఖాతాకు సంబంధించిన నిధులు ఉపసంహరణ జరిగి వేరే ఖాతాలకు మళ్లినట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లోనూ సంబంధిత కార్పొరేషన్‌ ఉద్యోగులతో పాటు, బ్యాంకు సిబ్బందిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తూంటారు. వాటి గురించి పట్టించుకోకపోతూడటంతో అక్రమార్కులతో కలిసి బ్యాంకు సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారు. వీరికి ఆయా కార్పొరేషన్లలో ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ డిపాజిట్ల మాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిధులు అక్రమంగా తరలించినట్లుగా తేలితే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.