SPs Transfers With In Short Period In Anantapuram: అనంతపురం జిల్లాలో (Anantapuram District) పోలీస్ బాస్‌గా పని చేయాలంటేనే కత్తిమీద సాములా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడు ఏ ఘటన చోటు చేసుకుంటుందో ఏ పొలిటికల్ లీడర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీని పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా జిల్లాలో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో ఎప్పుడూ జరగని విధంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గడచిన ఐదు నెలల్లో ఐదుగురు ఎస్పీల మారారు. ఇలాంటి విచిత్రం ఇంతకు మునుపెన్నడూ జరగలేదనే చర్చ జిల్లాలోనూ.. అటు డిపార్ట్మెంట్‌లోనూ వినిపిస్తోంది.


అంత తక్కువ సమయంలోనే..


ఎక్కడైనా ఓ జిల్లాకు కొత్త పోలీస్ బాస్ వచ్చారంటే కనీసం ఏడాదికో లేదా రెండేళ్లకో బదిలీ కావడం సర్వసాధారణం. కానీ అనంతపురం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే ఐదుగురు  ఎస్పీలు మారారు. అన్బురాజన్, అమిత్ బర్దార్, గౌతమి శాలిని, మురళీకృష్ణ వీరు జిల్లా పోలీస్ బాస్‌లుగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులు కూడా కాకుండానే బదిలీపై మరో చోటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా వి.జగదీష్ కొనసాగుతున్నారు. 5 నెలల్లోనే 5 మంది ఎస్పీలు మార్పు అంటేనే ఇది ఒక రికార్డుగానే పరిగణించవచ్చు.


పొలిటికల్ ప్రభావం ఉందా.? 


పోలీస్ శాఖపై పొలిటికల్ ప్రభావం ఎక్కువగా ఉందనడానికి అనంతపురం జిల్లా ఎస్పీల బదిలీ అద్దం పడుతోందని తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో పోలీస్ శాఖపై రాజకీయ పెత్తనం కొనసాగిందనేది 'జగ(న్)'మెరిగిన సత్యం. 2024 ఎన్నికల పోలింగ్ మునుపు అనంతపురం జిల్లా ఎస్పీగా అన్బురాజన్ ఉండేవారు. ఆయన అధినేత జగన్‌కు ఆ పార్టీ నేతలకు అనుకూలమనే ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలోకి 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, రాజస్థాన్ వాసి అమిత్ బర్దార్ వచ్చారు. పోలింగ్ మరుసటి రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్ల విషయంలో ఎస్పీ ఫెయిల్యూర్ అయ్యారంటూ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీగా గౌతమి శాలినీని నియమించారు. అనంతరం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఆమె సజావుగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో ఆమె బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం అందరూ ఊహించారు. అనంతరం జిల్లా ఎస్పీగా వచ్చిన మురళీకృష్ణ వెంటనే బదిలీ కావడం.. కొత్త ఎస్పీగా జగదీష్ రావడంతో పోలీసు శాఖలో చర్చ మొదలైంది.  


శాంతిభద్రతలు కాపాడే విషయంలో జిల్లా ఎస్పీలదే కీలక పాత్ర ఉంటుంది. జిల్లా ఎస్పీలే త్వరితగతిన మారుతూ ఉంటే శాంతిభద్రతల ప్రక్రియ ఎలా కుదురుకుంటుదనే భావన సామాన్యుల్లో నెలకొంది. దీనికి తోడు తాడిపత్రిలో అలర్లు పోలీసులకు పెను సవాలుగా మారాయి. ఈ మధ్య జరిగిన బదిలీల్లో ఖాకీలు తాడిపత్రికి ఆప్షన్ పెట్టుకోవాలంటే వెనుకాడే పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పోలీసు బాస్‌లను పదే పదే మార్చడం వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఎస్పీ జగదీష్ చార్జ్ తీసుకున్నారు. ఈయన జిల్లాలో ఎన్ని రోజులు కొనగుతారు అన్నది తెలియాల్సి ఉంది.


Also Read: Andhra News: ఏపీలో తక్కువ ధరకే అన్ని రకాల మద్యం బ్రాండ్లు - మద్యం షాపుల కొత్త టైమింగ్స్ ఇవే!