Final notification on new districts and divisions in AP on December 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా చేపట్టిన జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో మంత్రులు,ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత నెల 27న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సమీక్ష జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల సరిహద్దులు, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వానికి మొత్తం 927 అభ్యంతరాలు, వినతులు అందాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు నేటితో ముగియడంతో, అందిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యంతరాలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ పునర్విభజన ప్రక్రియ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే. గతంలో జరిగిన విభజనలో కొన్ని చోట్ల ప్రజలకు జిల్లా కేంద్రాలు దూరం కావడం, మరికొన్ని చోట్ల భౌగోళిక వైరుధ్యాలు ఉండటంతో, ప్రస్తుత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోయే డివిజన్లు , మండలాల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం, అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1 నుండి కొత్తగా ఏర్పాటైన జిల్లాలు లేదా డివిజన్లు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పునర్విభజన కేవలం కాగితాల మీద మార్పు కాదని, ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుది నోటిఫికేషన్ వెలువడే వరకు ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను కోరారు.
గతంలో విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లోని పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొన్ని మండలాలను ఒక డివిజన్ నుండి మరొక డివిజన్‌కు, మరికొన్నింటిని ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మార్చారు. జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉన్న మండలాలను, ప్రజల కోరిక మేరకు దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రానికి అనుసంధానించేలా సరిహద్దులను సవరించారు. నెల్లూరు, గూడులు సహా పలు చోట్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా మార్చినట్లుగా తెలుస్తోంది. తుది నోటిఫికేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.