YSRCP new incharges Fact check: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మంది ఇంచార్జుల్ని మార్చుతూ వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో లెటర్ వైరల్ అయింది. ఇందులో కొన్ని నియోజకవర్గాల మార్పులు ఉన్నాయి. ఈ లెటర్ తప్పు అని వైసీపీ ప్రకటించింది.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కాకినాడ రూరల్ ఇంచార్జిగా ప్రకటించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును పక్కన పెట్టారు. ఆయనకు ఎక్కడా వేరే చోట్ల ఇంచార్జిగా ఇవ్వలేదు. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావును ఇంచార్జిగా ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కు టిక్కెట్ నిరాకరించారు జగ్గంపేట ఇంచార్జ్‌గా మాజీ మంత్రి తోట నర్సింహంను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టిక్కెట్ గల్లంతు అయినట్లుగా ఆ లెటర్ ప్యాడ్‌లో చెప్పారు.
పిఠాపురం నియోజకవర్గానికి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతను ఇంచార్జుగా నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు టిక్కెట్ నిరాకరించారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తోట త్రిమూర్తుల్ని అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన మండపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడే పని చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఆయనను రామచంద్రాపురం ఇంచార్జిగా నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామచంద్రాపురం నుంచి తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి మండపేట కేటాయించారు. గత ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి పిల్లి సుభాష్ ఓడిపోయారు. మధ్యలో ఆ సీటులో తోట త్రిమూర్తులు పని చేసుకున్నా.. చివరికి ఆయన కుమారుడికే సీటు కేటాయించారని ఉంది.
పాయకరావు పేట నియోజకవర్గానికి.. పెడవటి అమ్మాజీని ఇంచార్జిగా నియమించారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన అమ్మాజీకి అక్కడ జనసేన ఫిరాయింపు ఎమ్మెల్యే రాపాక తానే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో చివరికి పాయకరావుపేటలో సర్దుబాటు చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావు సీటు గల్లంతు అయింది. ఈయన జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.ఇక రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్ కు సీటు కేటాయించారు. ఇక్కడ టిక్కెట్ కోసం.. పలువురు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. మార్గాని భరత్ కు మార్గం సుగమం అయినట్లుగా ప్రకటించారు.
గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై సీఎం కసరత్తు చేస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.