Fake campaign claiming bribe for pension in Hindupur : రాజకీయాల్లో ప్రత్యర్థులపై బురదచల్లే అవకాశం వస్తే ఎవరూ వదిలి పెట్టరు. ఫేక్ న్యూస్ అయినా సరే వైరల్ చేస్తే అదే జనాల్లోకి వెళ్తుందని.. నమ్మేవాళ్లు నమ్ముతారని అనుకుంటారు. నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందన్నట్లుగా ఫేక్ న్యూస్ ఇట్టే వైరల్ అయిపోతుంది. దాని బారిన పడిన వారు ఆ బురద కడుక్కోక తప్పదు. 

ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. అందుకే ఆ నియోజకవర్గంపై మరింత గురి ఉంటుంది. తాజాగా ఓ మహిళ ఓ బంగారం దుకాణంలో తన దిద్దులు కుదువపెడుతూ ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. తనకు పెన్షన్ ఇస్తామన్నామని అయితే అందు కోసం పదివేలు లంచం అడిగారని అందుకే తన  దిద్దులు ఆమె తాకట్టు పెడుతోందని ప్రచారం చేశారు. బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో కాసేపటికే వీడియో వైరల్ అయింది.               

 అయితే ఈ వీడియోపై ప్రభుత్వం విచారణ చేయించిది. తాను దిద్దులు తాకట్టు పెట్టుకుంది కుటుంబపరమైన కారణాలతో అని కోడలికి అనారోగ్యంగా  చూపించడానికి తాకట్టు పెట్టుకున్నానని ఆమె చెబుతున్నారు. పెన్షన్ కోసం తనను ఎవరూ డబ్బులు అడగలేదని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని తెలిపింది.                               

 వీడియోలను ఇలా ట్విస్టులు చేసి.. రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారాలు చేయడంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్‌లు.. స్ప్రెడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వీడియోను తప్పుడు సమాచారంతో వైరల్ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. వాక్ స్వేచ్చ పేరుతో ఇతరుల వీడియోలను ఉపయోగించుకుని.. అందులో లేని విషయాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ వీడియో కారణంగా పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యే అవకాశాలు  కనిపిస్తున్నాయి.