Vizag Airport Incident: జనసేన కార్యకర్తలు కావాలనే ఎయిర్ పోర్టులో బీభత్సం సృష్టించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తన కార్యకర్తల దాడిపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాటలు, నీట మీద రాతలు ఒకటేనని అన్నారు. మాటమార్చే తత్వానికి జనసేన అధినేతను ఐకాన్ గా చూపించవచ్చని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించిందని, ఆ విషయం కూడా పవన్ కల్యాణ్ కు తెలియదా అని నిలదీశారు. కార్యకర్తల చేతులకి కర్రలు ఇచ్చి రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. జనసేన అల్లరి మూకలు మంత్రులపై దాడి చేశాయని ఆరోపించారు. 


మహిళా మంత్రిని పట్టుకొని అసభ్యంగా తిట్టారని పేర్ని నాని పేర్కొన్నారు. దళిత మంత్రిపై చెప్పులేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి బూతులు తిట్టడం దారణం అన్నారు. పవన్ కల్యాణ్ ర్యాలీ కారణంగా రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడుతున్నారని చెబితే తప్పా అని ప్రశ్నించారు. అడ్డదిడ్డంగా వాగుతూ విధాన పరమైన విమర్శ మాత్రమే చేస్తున్నా అంటారా అంటూ మండిపడ్డారు. పూటకో మాట, నెలకో మాట మాట్లాడే తత్వం పవన్ కల్యాణ్ ది అంటూ ఫైర్ అయ్యారు. మంత్రులపై దాడి చేస్తే పోలీసులు చర్యలు తీసుకోరా.. జనసేన రైడీలు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా అంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల గొంత నొక్కేందుకు ప్రయత్నించారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి వచ్చినా.. మేం రెడీ అంటూ సవాల్ విసిరారు. వీరంతా కలిసి పోటీ చేసినా విజయం తమదే అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. 


విశాఖ ఘటనపై ఇరు పార్టీ నేతల కామెంట్లు.. 


విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకున్నాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. దాడి చేసిన వాళ్లను వదిలి పెట్టే సమస్య లేదంటున్నారు మంత్రులు. విశాఖ గర్జన ముగించుకొని మంత్రి జోగి రమేష్‌, రోజా, ఇతర వైసీపీ లీడర్లు వెళ్తున్న టైంలో జన సైనికులు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో లీడర్ల కార్ల అద్దాలు ధ్వంసం చేశారని చెబుతోంది. దీనికి పూర్తి బాధ్యత పవన్ కల్యాణ్‌దేనంటున్న వైసీపీ... సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 


మంత్రులపై జరిగిన దాడి అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆ దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదన్నారు. విమర్శ, ప్రతివిమర్శతోనే ఏ వివాదమైనా సద్దుమణిగిపోవాలి కానీ ఇలాంటి దాడులు సరికావు అని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ఆకాంక్ష వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించడమేనన్నారు స్పీకర్ తమ్మినేని. అలాంటి కోరికతో పెద్ద ఎత్తున సభ జరిగితే..దానిని వ్యతిరేకంగా జరిగిన దాడిగా ఈ ఘటనను చూస్తున్నామన్నారాయన. మంత్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి దాడులు చేస్తే..మరింత తీవ్రంగా ప్రతి దాడి జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే అందరూ సంయమనం పాటించాలని కోరారు.