Harirama Jogaiah : మాజీ మంత్రి హరిరామజోగయ్య దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామజోగయ్య నిరాహార దీక్ష చేపట్టారు. జనసేన నేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తితో ఆయన దీక్ష విరమించారు. ఏలూరు ఆసుపత్రిలో ఉన్న హరిరామజోగయ్యతో పవన్ కల్యాణ్ ఫోనులో మాట్లాడారు. దీక్ష విరమించాలని కోరారు. ఈ వయసులో మందులు కూడా వేసుకోకుండా దీక్షలు చేయడం సరికాదాని కోరారు. అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుని ఈ విషయంపై ముందుకు వెళ్దామన్నారు. దయచేసి దీక్ష విరమించాలని హరిరామజోగయ్యను కోరారు.
దీక్ష విరమించాలని కోరాను - పవన్
"కొద్ది నిమిషాల క్రితం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మాజీ మంత్రి హరిరామజోగయ్యతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై ఆయన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు దిగే ముందే పోలీసులు ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాను. వయసు రీత్యా దీక్ష విరమించాలని ఆయనను కోరాను. ఈ మొండి ప్రభుత్వంపై పోరాడాలని ఆయన సూచనలు కావాలి. ఈ వయసులో దీక్షకు దిగడంపై అందరూ ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ సమయంలో హరిరామజోగయ్య ఇంటిపై దాడి కూడా జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించాలని కోరాను. పూర్తిగా విరమించకపోయిన తాత్కాలికంగా దీక్ష విరమించాలని కోరాను. " - పవన్ కల్యాణ్
కాపు రిజర్వేషన్లపై హైకోర్టుకు
"పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించాను. కాపు రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నాకు మద్దతు తెలిపేందుకు చాలా మంది వచ్చారు. వారిని అరెస్టు చేశారు. వారిపై వెంటనే రిలీజ్ చేసి ఎలాంటి కేసులు లేకుండా చేయాలి. నేను దీక్షను విరమించుకున్నాను. కాపు రిజర్వేషన్ల కోసం చేపట్టే భవిష్యత్ కార్యక్రమాలపై తెలియజేస్తాను. రిజర్వేషన్ల కోసం పోరాడతాను." -హరిరామజోగయ్య
85 ఏళ్ల వయసులో దీక్ష
కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆమరణ దీక్ష చేపట్టారు. పాలకొల్లు ఆయన దీక్షకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆయనను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఏలూరు ఆసుపత్రిలో ఆయన దీక్ష చేశారు. హరిరామజోగయ్యకు మద్దతు తెలిపేందుకు కాపు నేతలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 85 ఏళ్ల వయసులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం పవన్ కల్యాణ్ హరిరామజోగయ్యకు కాల్ చేశారు. ఈ విషయంపై అందరూ కలిసి ఒకసారి చర్చించాలన్నారు. ప్రస్తుతానికి దీక్ష విరమించాలని కోరారు. పవన్ సూచనతో హరిరామజోగయ్య దీక్ష విరమించారు.