AP Land Titling Act Latest News: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్న రెండు అంశాలలో ఒకటి పెన్షన్ పంపిణీ కాగా, రెండో విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ, బ్యాంకు ఖాతాల్లో పిన్షన్ నగదు జమపై అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్షపార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ల్యాండ్ టైటిలంగ్ యాక్ట్ పై, ఇదే విషయంలో సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీ చేస్తున్న ప్రచారంపై విచారణకు సీఐడీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తెచ్చిన చట్టాలపై దుష్ప్రచారం చేయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆరోపణలు
గత కొన్ని రోజుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. మార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం వైఎస్ జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టింది.
తమ ఫిర్యాదుపై ఈసీ స్పందించిందన్న మల్లాది విష్ణు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు, ఇతర నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తాము చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఐటీడీపీ సైట్‌లో సైతం ఏపీ సీఎం జగన్ భూములు లాక్కుంటున్నారని దుష్ప్రచారం జరుగుతున్నట్లు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేసి ఏపీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. భూ వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంపై మోదీతో చర్చించే దమ్ము, ధైర్యం లేదు కానీ సీఎం జగన్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లో లేకున్నా, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు, పవన్ ప్రచారం చేస్తున్నారని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.