Chat Bot Service : తూర్పుగోదావరి జిల్లాలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం "CHAT BOT" సేవలు ప్రారంభించారు పోలీసులు. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు 117 ఫోన్లు అందజేశారు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.  ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువయ్యాయి. పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసేందుకు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు.  


117 ఫోన్లు రికవరీ 


"CHAT BOT" సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే సుమారు రూ. 22,30,500  విలువ చేసే 117 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి శుక్రవారం బాధితులకు వారి ఫోన్లను అందజేశామని పోలీసులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే తిరిగి వారి ఫోన్ చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. "CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురైనా, మిస్ చేసుకున్న వారు, ఈ వాట్సాప్ నంబర్ 9493206459కు HI లేదా HELP అని మెసేజ్ పంపాలని సూచించారు. ఈ ఛాట్ బాట్ సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుని పోగొట్టుకున్న మొబైల్స్ ను పొందవచ్చని పోలీసులు తెలిపారు. ఎవరికైనా దొరికిన సెల్ ఫోన్ లను సొంతానికి వాడుకోవడం కానీ, గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా
బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కానీ చేయకూడదన్నారు. మీకు దొరికిన సెల్ ఫోన్ లను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి అందజేయాలని తెలియజేశారు. 


"మిగతా జిల్లాలతో పోలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతానికి 500 కంప్లైంట్స్ వచ్చాయి.  వీటిల్లో 120 మొబైల్స్ ను 20 రోజుల్లో రికవరీ చేశారు. వాటిని బాధితులకు అందిస్తున్నారు. ఇంకా ఎవరివైనా ఫోన్లు పోతే ఫిర్యాదులు ఇవ్వండి. వెంటనే దొరక్కపోయినా కొంచెం టైం తర్వాత రికవరీ చేస్తాం. అందరూ ఈ ఛాట్ బాట్ సర్వీస్ వాడుకోండి. వేరే జిల్లాల్లో వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. పోగొట్టుకున్న ప్రతీ మొబైల్ ను రికవరీ చేస్తాం"- ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి 


కర్నూలు జిల్లాలోనూ 


 సెల్ ఫోన్ పోతే పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు, మీ ఫోన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఏపీ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాలో 4 వ విడతలో భాగంగా రికవరీ చేసిన 1924 సుమారు రూ. 3 కోట్ల 50 లక్షల విలువ గల ఫోన్లను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బాధితులకు అందజేశారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే నాల్గో విడతలో వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన 1924 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు.  ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మాట్లాడుతూ పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.