East Godavari News : తూర్పు గోదావరి జిల్లా  రాజానగరం నన్నయ్య బాలికల వసతి గృహంలో ఉప్మాలో కప్ప వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికలు ఉప్మాలో  చనిపోయిన కప్పను గుర్తించారు.  దీంతో విద్యార్థినిలు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ అశోక్ వసతి గృహాన్ని పరిశీలించారు.  వంటలు సరిగ్గా వండకపోతే చర్యలు తీసుకుంటామని వంట మాస్టర్ లను రిజిస్ట్రార్ హెచ్చరించారు.  


అసలేం జరిగింది? 


తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఆదివారం బాలికల వసతి గృహంలో ఉప్మాలో చనిపోయిన కప్ప వచ్చింది. దీంతో బాలికలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఉప్మా తయారుచేసి ఒక పెద్ద గిన్నెను బాలుర వసతి గృహానికి, మరొకటి బాలికల వసతి గృహానికి పంపించారు. బాలికల హాస్టల్ లో సుమారు 75 శాతం మంది ఉప్మా తిన్నాక ఆ గిన్నెలో చనిపోయిన కప్పను గుర్తించారు.  ఈ విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్​ అశోక్‌ హాస్టల్ కు చేరుకుని పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. రిజిస్ట్రార్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట రుచికరంగా ఉండటం లేదని, పురుగులు వస్తున్నాయని వంట మనుషులను మార్చాలని విద్యార్థినిలు ఆందోళనచేశారు.


భోజనంలో కాకిఈక 


విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నాగార్జున హాస్టల్ లో విద్యార్థులకు పెట్టిన భోజనంలో కాకి ఈక రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకే మెస్‌లోకి సిబ్బంది వెళ్లకుండా తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. ఇలాంటి భోజనం ఎక్కడా చూడలేదని ఆరోపించారు. వసతి గృహంలో ఆహారం సరిగా లేకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లి భోజనం చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. భోజన సమయంలో తప్ప మిగతా టైంలో తాగునీరు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు. చీఫ్‌ వార్డెన్‌ విజయమోహన్‌, వార్డెన్‌ హరనాథ్‌ విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు మెస్‌ తాళం తీశారు.  


కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ 


 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 22 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు KGBV కి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపుతారన్న భయంతో విద్యార్థులు బయటకు సమాచారం చెరవేయలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు.