JD Lakshmiranarayana: రాజకీయాలు, ఆశయాలు వదిలి ఉద్యోగంలోకి జేడీ లక్ష్మినారాయణ - సైబర్ మోసం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?
Former CBI JD: సీబీఐ మాజీ జేడీ, రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్మినారాయణ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇటీవల సైబర్ మోసంలో ఆయన కుటుంబం రెండున్నర కోట్లు నష్టపోయింది.

Lakshminarayana joins Megha Group: సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. అవినీతి తిమింగలాల గుండెల్లో నిద్రపోయిన అధికారిగా, అచంచలమైన నిజాయితీకి మారుపేరుగా ఆయన నిలిచారు. అయితే, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు ఐపీఎస్ పదవిని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఈ మిస్టర్ క్లీన్, ఇప్పుడు అనూహ్యంగా అన్నింటినీ వదిలేశారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయారు. నిజానికి ఆయన అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని తన అభిరుచి మేరకు రాజకీయ, సేవా రంగంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు మళ్లీ ఉద్యోగ బాధ్యతల్లోకి వెళ్లారు?
సైబర్ మోసంతో సర్వీసులో కూడబెట్టుకున్నదంతా పోగొట్టుకున్నారా?
ఇటీవల ఆయన కుటుంబం సైబర్ మోసగాళ్ల బారిన పడింది. రెండున్నర కోట్ల వరకూ నష్టపోయారు.తన సుదీర్ఘ సర్వీసులో కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకే ఒక్క సైబర్ మోసంతో ఆవిరైపోవడం ఆయనను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందన్న అభిప్రాయం కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందే తనదైన ముద్ర వేసిన లక్ష్మీనారాయణ, 2019 నుంచి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతులు, యువతకు అండగా నిలిచారు. తన నిజాయితీతో కూడబెట్టిన సంపాదన అంతా కళ్లముందే మాయమైపోవడంతో ఆయనకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్లుగాభావిస్తున్నారు.
ప్రజా సేవ నుంచి ప్రైవేటు ఉద్యోగం వైపు..!
రాజకీయాల్లో ఓటమి ఆయనను ఎప్పుడూ కుంగదీయలేదు. రాజకీయాలు కాకపోతే రైతుల కోసం..యువత కోసం పని చేస్తానని ఆయన ప్రత్యేక సంస్థ పెట్టారు. భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం కూడా చేస్తున్నారు. పిల్లలకు మంచి చెప్పాలని ఎవరు పిలిచినా వెళ్లి చెప్పి వస్తారు. అలాంటి ఆయన అన్నీ వదిలేసి ఉద్యోగంలో చేరాలనుకోవడం వెనుక బలమైన కారణం ఉండటం సహజమే. అది ఆర్థిక సంక్షోభం అనే ఎక్కువ మంది భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. అటు రాజకీయ వైఫల్యం, ఇటు సైబర్ నేరం వల్ల కలిగిన భారీ నష్టం కారణంగా.. తన కుటుంబ బాధ్యతలు మరియు జీవన పోరాటం కోసం ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు.
మేఘా గ్రూపులో కొత్త బాధ్యతలు
ఐపీఎస్‌గా ఎన్నికయి పోలీస్ ఆఫీసర్ అయ్యారు కానీ.. ఆయన ఇంజినీరింగ్ చదివారు. మేఘా గ్రూప్, ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ సంస్థ అనుబంధ కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్ లో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టారు. ప్రజా క్షేత్రంలో ఉండి వ్యవస్థను మార్చాలనే గొప్ప ఆశయం ఉన్నప్పటికీ, సైబర్ నేరగాళ్ల కారణంగా ఎదురైన ఆర్థిక విపత్తు ఆయనను అనివార్యంగా మళ్లీ వృత్తిపరమైన కెరీర్ వైపు నడిపించిందని అనుకోవచ్చు.






















