Kethireddy Venkatarami Reddy Comments: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు విమర్శలు చేస్తే ఫలితం ఏమీ ఉండబోదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ఎన్నికల హామీలపైన ప్రశ్నిస్తే అది మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రెండు నెలల్లో పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని, తగినంత సమయం ఇవ్వాలని అన్నారు. తక్కువ సమయంలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వం అవుతుందని.. వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంపదను క్రియేట్ చేసి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారని అన్నారు.


కేతిరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో లైవ్ లో మాట్లాడారు. చెత్తను సేకరించడం జగన్ మోహన్ రెడ్డి హాయాంలో అమలు చేస్తే ఆయన్ను చెత్త ముఖ్యమంత్రి అన్నారని కేతిరెడ్డి గుర్తుచేశారు. చెత్తకు పన్ను వేయడం ఎక్కడైనా ఉంటుందని, ఆ పని తప్పేంకాదని కేతిరెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా చెత్త పన్నును వసూలు చేస్తున్నా, దాన్ని తాను సమర్థిస్తానని అన్నారు. 


తమ గత ప్రభుత్వానికి మద్యం, ఇసుక అక్రమాలు చేయడం వల్లే చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు. అన్ని పథకాల్నీ అమలు చేసినా వైసీపీకి 11 సీట్లే వచ్చాయని ఆవేదన చెందారు. తాను ఎప్పటికీ ప్రజల్లోనే తిరిగానని.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో.. తానే ఉదయాన్నే ప్రజల వద్దకు కాలినడకన వెళ్లి, అన్ని పనులు చేయించానని గుర్తు చేశారు. ఇంత చేసినా తనకు నిందలు, ఓటమి తప్ప ఏమీ మిగల్లేదని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్‌ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యారని వివరించారు. కనీసం నా అని చెప్పుకున్న వర్గాలు కూడా జగన్ వైపు ఉన్నారో లేదో డౌటే అని విశ్లేషించారు.