Deputy CM Pawan Kalyan: క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు - పథకాల అమలుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Deputy CM : ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు మరియు ఉదాసీనత కనిపిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అద్భుతంగా చేశామనుకున్నా కొంత గ్యాప్ కనిపిస్తోందన్నారు.

Deputy CM says still some shortcomings in implementation of decisions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూనే, అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రులు, శాఖల కార్యదర్శుల సమావేశంలో ప్రసంగించారు. ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల ప్రయోజనం కోసమే వినియోగించాలని, క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచడం ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర పురోభివృద్ధి కోసం సుమారు రూ. 11,328 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో పల్లె పండుగ , అడవి తల్లి బాట వంటి పథకాల ద్వారా గ్రామీణ . గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ కింద రూ. 10 వేల కోట్ల విలువైన పనులను ఇప్పటికే ప్రారంభించామని, అటవీ శాఖ ద్వారా రూ. 200 కోట్లతో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు , ఉదాసీనత కనిపిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలపరిమితిలో పనులు పూర్తి కాకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, అధికారులు వెంటనే మేల్కోవాలని సూచించారు. నిర్ణయాల అమలులో అలసత్వాన్ని వీడండి, నిజాయతీగా పనిచేయండి అని ఆయన అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ కిందిస్థాయి సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం చేయాలని ఆయన ఆదేశించారు.
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 9, 2026
🔸రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నాం
🔸 నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దు
🔸 క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి
🔸 ఉదాసీనత వీడండి.. పారదర్శకతే మా విధానం
🔸 మంత్రులు,… pic.twitter.com/o5dPzNpWKN
ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పునాదిగా చేసుకుని పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. పాలన అనేది కేవలం నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయం కాదని, అది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తూనే, పనుల పూర్తి విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.























