Deputy CM Pawan Kalyan in mamandoor Forest: తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.
అంతకు ముందు తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
పవన్ కల్యాణ్ సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా.. భిన్నమైన డ్రెస్ లో రావడం అందర్నీ ఆకర్షించింది. డిప్యూటీ సీఎం అయితే మాత్రం స్టైలిష్ డ్రెస్‌లో రాకూడదనేం లేదు కాబట్టి కల్యాణ్ ఇటీవల స్మార్ట్ గా క్యాజువల్స్ లోనే సమీక్షలు నిర్వహించారు. అటవీ ప్రాంత పర్యటనకు ఆర్మీ తరహా డ్రెస్ తో వచ్చారు. ఆయన అలా రావడంతో పోలీసులు కూడా తమలో ఒకరిగా చూసుకున్నారు.