Deputy CM Pawan Kalyan:  ‘అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అన్నారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై   అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

Continues below advertisement

రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాజీ అటవీ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణల మీద తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం గురించి  ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లా, ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పరిశీలించారు. అడవిలో వేసిన కంచె, సరిహద్దులను విహంగ వీక్షణం ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు, శాఖ ఆస్తులు పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు.

మంగళంపేట అటవీ భూముల అంశాన్ని అధికారులు వివరించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పి.ఓ.ఆర్.), ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామన్నారు. పి.ఓ.ఆర్., విజిలెన్స్ నివేదిక వివరాలపై చర్చించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.  అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉంది. చట్టం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన విధి అధికార యంత్రాంగంపై ఉంది. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకి ఉపక్రమించండి. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయి. మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశం. సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూ లెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయి. వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు  కనిపిస్తోంది. ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.

Continues below advertisement

 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు  మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం నా దృష్టికి వచ్చింది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలాగే  భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది కూడా పరిశీలించాలన్నారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలన్నారు. అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.