Deputy CM Pawan Kalyan First Signed On Two Files: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) బుధవారం విజయవాడలోని (Vijayawada) క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే కీలక పైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. అలాగే, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి రెండో సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు జనసేన నేతలు, టీడీపీ నేతలు అభినందనలు తెలియజేశారు. అధికారులు సిబ్బంది శాలువాతో సత్కరించి విషెష్ చెప్పారు.


హామీల అమలుకు తొలి అడుగు










కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి సంతకం ఉద్యానవన పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానించి నిధుల మంజూరుపై చేయడంతో ఎన్నికల హామీల అమలు దిశగా తొలి అడుగు పడిందంటూ జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వ్యవసాయంలో ఉన్న వారంతా లబ్ధి పొందేలా వ్యవసాయాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకువస్తామని జనసేన హామీ ఇచ్చింది. దాని ప్రకారమే జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఫైలుపై తొలి సంతకం చేశారు. అలాగే, రెండో సంతకం గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై చేశారు. దీంతో గ్రామ స్వరాజ్య సాధనకు జనసేనాని తొలి అడుగు వేశారని జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిన పంచాయతీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టారని ట్వీట్‌లో పేర్కొంది.


ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ ఆ హోదాలో.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. తనకు కేటాయించిన శాఖలు జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని.. ఎన్నికల ముందు తన పర్యటనల్లో గిరిజనుల సమస్యలు చూశానని.. సరైన తాగునీరు, రహదారులు లేక వారు పడ్డ ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. అలాగే, అటవీ సంపద నాశనం కాకుండా కాపాడతానని, ఎర్రచందనం అక్రమ రవాణా అరికడతామని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణతో జనసైనికులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.