MP GVL On Visakha Port : విశాఖపట్నం పోర్టు నుంచి 70 మిలియన్ టన్నుల బొగ్గు, ఐరన్ ఓర్, పెట్ కోక్, కోక్ వంటి అత్యంత భారీ సరుకు ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి. అయితే ఓడరేవులో ఎగుమతి దిగుమతి కార్యకలాపాల వల్ల కలిగే కాలుష్యం విశాఖ, పరిసర ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. దీనిపై వెంటనే సరైన తీసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లో కేంద్ర మంత్రిని కోరారు. విశాఖపట్నం పోర్టు ప్రారంభమైనప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుమ్ము ఉద్గారాలు పెరిగాయన్నారు. వాటిని తగ్గించడం కోసం షెడ్ లను నిర్మించాలని కోరారు. లేకపోతే ఇది చాలా పెద్ద సమస్య అవుతుందని ఎంపీ జీవీఎల్ పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు.
సాగర్ మాల ప్రాజెక్టులో
షెడ్ ల నిర్మాణం చాలా వ్యయంతో పని అని, వీటిని ప్రైవేట్ బెర్త్ ఆపరేటర్లు చేపట్టలేరన్నారు. పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిరావడం, వసూలయ్యే కాలం ఎక్కువ కావడంతో షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగర్ మాల ప్రాజెక్ట్ కింద ఈ పెట్టుబడిని పెట్టాలని కోరారు. ఈ పెట్టుబడులను వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా పెట్టుబడిని తిరిగి పొందాలని ఎంపీ జీవీఎల్ కేంద్రానికి ప్రతిపాదించారు. కాలుష్య ఉద్గారాలను అరికట్టడానికి కోకింగ్ బొగ్గు, ఆవిరి బొగ్గు కార్యకలాపాలను కవర్ షెడ్ల పరిధిలోకి తీసుకురావడానికి ఒక నిర్ణీత కార్యాచరణ ప్రారంభించాలన్నారు.
రెండు షెడ్ల నిర్మాణం
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఇప్పటికే రెండు షెడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. మరో రెండు షెడ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, సామర్థ్యం, అత్యాధునికమైన షెడ్లను స్టాకర్ రీక్లెయిమర్లు లేదా వ్యాగన్ లోడింగ్ వ్యవస్థలతో నిర్మించాల్సిన అవసరం ఉందని జీవీఎల్ సభలో ప్రస్తావించారు. ప్రజారోగ్యం ఓడరేవు కార్యకలాపాల సుస్థిరత దృష్ట్యా, ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి కవర్ షెడ్లను ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జివీఎల్ అభ్యర్థించారు. దీనిపై ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలకు ప్రజారోగ్య విషయంలో హాని కలిగించే ఏ విషయంపై నైనా ఎంత స్థాయిలోనైనా ప్రయత్నం చేసి పూర్తిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.
విశాఖలో పెరుగుతున్న కాలుష్యం
శీతాకాలంలో గాలిలో నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. విశాఖ నగరానికి నైరుతి దిశలో ఉన్న పరిశ్రమలు ప్రధానంగా పోర్టు, హెచ్‌పీసీఎల్, ఇతర పెట్రోలియం ఆధారిత పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా విశాఖ పోర్టు నుంచి బొగ్గు ధూళి నగరంలోని అనేక ప్రాంతాలను వ్యాపిస్తోంది. జ్ఞానాపురం, పాత నగరం నుంచి అక్కయ్యపాలెం, కంచరపాలెం, మురళీనగర్, సీతమ్మధార, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లోని ఇళ్లల్లో నల్లటి బొగ్గు దుమ్ము కనిపిస్తుంటుంది. దీనికి తోడు నగరంలో వాహన కాలుష్యం కూడా పెరుగుతుంది. కాలంచెల్లిన వాహనాల వినియోగం, నగరం మధ్య నుంచే సరకు రవాణా వాహనాల ప్రయాణం, వాహనాల వినియోగం పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. విశాఖలో నిర్మాణాల సమయంలో బిల్డర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ ప్రాంతాల నుంచి దుమ్ము పరిసరాల్లోకి వ్యాపిస్తుంది. ధూళి కాలుష్యం తీవ్రత తగ్గించడానికి కాలుష్య నియంత్రణ మండలి సూచనలను పరిశ్రమలు పాటించడంలేదని తెలుస్తోంది.