Deccan Gold Mine Company to undertake gold mining in AP: బంగారం రేటు ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో బంగారం గనులు బయటపడితే ఇక పంట పండినట్లే. ఇప్పుడు ఏపీకి ఇలాంటి అదృష్టమే ఎదురు వచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రత్యేక ఉత్పత్తి మొదలుపెట్టనుంది.. జోన్నగిరి ప్రాజెక్ట్‌లో సంవత్సరానికి 750 కేజీల నుంచి   1000  కేజీల బంగారం వెలికి తీసేందుకు సిద్ధమయ్యారు. 

డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) భారతదేశంలో మొదటి పెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్‌ కంపెనీ. ఆంధ్రప్రదేశ్‌లోని జోన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టి తవ్వకాలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో ఉత్పత్తి ప్రారంభమవబోతోందని ఆ సంస్థ ప్రకటించింది. తవ్వకాలకు అవసరమైన  పర్యావరణ  అనుమతులు,  రాష్ట్ర స్థాయి అనుమతులు పొందిన ఈ ప్రాజెక్ట్ ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తవ్వకాల ద్వారా సంవత్సరానికి సుమారు 750 కేజీల నుంచి 1000 కేజీల వరకూ బంగారం వెలికి తీసే అవకాశం ఉంది. కంపెనీ ఎండీ రమేష్ వెలుస్వామి గురువారం పీటీఐకి  ఈ విషయం చెప్పడంతో ఆ కంపెనీ  షేర్లు 11 శాతానికి పైగా పెరిగాయి.

కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం నిల్వలు ఉన్నట్లుగా గతంలోనే గుర్తించారు. అయితే బంగారం మైనింగ్ అనేది అత్యంత క్లిష్టమైన వ్యవహారం. ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థలు ఆసక్తి చూపించలేదు. ప్రైవేటు సంస్థ అయిన  డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆసక్తి చూపించి అనుమతులకు దరఖాస్తు చేసుకుంది.  ఈ సంస్థ భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్‌లో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ సంస్థ.  ఈ మైన్‌లో 7 నుంచి 25 సంవత్సరాల వరకు తవ్వకాల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.  

డీజీఎంఎల్ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (జీఎస్‌ఐఎల్)లో 40 శాతం షేర్‌లను 2023లో స్వాధీనం చేసుకుంది. ఈ ఆక్విజిషన్‌తో ప్రాజెక్ట్ వేగవంతమైంది. మొత్తం పెట్టుబడి రూ.200 కోట్లకు పైగా ఉంది. మెషినరీ, ఎక్విప్‌మెంట్‌లపై   రూ.300 కోట్లు గా ఖర్చు చేస్తున్నారు, ఇందులో 30,000 బోర్‌వెల్ టెస్టింగ్‌లు ,  అధునాతన టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.  "ఈ ప్రాజెక్ట్ భారతదేశ గోల్డ్ ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మేము త్వరలో పూర్తి ఉత్పత్తి మొదలుపెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాము" అని డీజీఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ వెలుస్వామి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు .

భారతదేశం సంవత్సరానికి సుమారు 800-1000  బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.  ఈ మైన్ ఉత్పత్తి మొదలైతే, దేశీయ గోల్డ్ సరఫరానికి గణనీయమైన దోహదపడుతుందని భావిస్తున్నారు.  ప్రస్తుతం దేశంలో గోల్డ్ మైనింగ్ ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ సంస్థలు చేపడుతున్నాయి. డీజీఎంఎల్, బీఎస్‌ఈలో లిస్టెడ్ మొదటి, ఏకైక గోల్డ్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ. ఈ సంస్థ కిర్గిజ్‌స్తాన్‌లోనూ  గోల్డ్ మైనింగ్ చేస్తోంది. అక్కడ అక్టోబర్‌లో  ఉత్పత్తి మొదలుపెట్టనుంది.