APSRTC: పండగలు వస్తున్నాయంటే.. సంతోషంతో పాటు ఆందోళన కూడా ఉంటుంది. ముఖ్యంగా సిటీలో నివసించే వాళ్లు పండగలకు సొంతూళ్లకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలీచాలనీ ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకవు. అంతంత దూరం నిలబడి ప్రయాణించలేరు. ప్రైవేటు బస్సుల్లో వెళ్దామంటే తలకు మించిన భారం అవుతుంది. సాధారణ ఛార్జీలతో పోలిస్తే భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాయి ప్రైవేటు బస్సు సర్వీసులు. పండగల వేళ ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడుపుతుంటాయి. ఈ ప్రత్యేక బస్సులోనూ ఛార్జీలు మోత మోగిస్తాయి. సాధారణ ప్రయాణికుడు ఈ ఛార్జీల భారం మోయలేక.. పండగ ఎందుకొచ్చింది అని బాధ పడిపోతుంటారు. ఉద్యోగం నిమిత్తం, పిల్లల చదువుల కోసం, ఉపాధి కోసం నగరం బాట పట్టిన వారు.. పండగలను సొంతూళ్లలో జరుపుకోవాలని కోరుకుంటారు. ఇంటిల్లిపాది ప్రయాణాలకు సిద్ధం అవుతారు. అలాంటి వారిపై ఈ బస్సు ఛార్జీలు విపరీతమైన భారాన్ని మోపుతుంటాయి.


పండగ వేళ సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. దసరాకు 5,500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. అదీ కూడా సాధారణ ఛార్జీలతోనే అని చెప్పింది. సాధారణ ఛార్జీలతోనే దసరా ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. దసరా కోసం ఈ నెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ బుధవారం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రదాన పట్టణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఈ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది.


అన్ని జిల్లా కేంద్రాలకు బస్సు సర్వీసులు


దసరా పండగకు ముందుగా ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 2,700 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దసరా అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 2,800 బస్సు సర్వీసులు నడుపుతారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 1,137 బస్సు సర్వీసులు నడపనుంది ఏపీఎస్ ఆర్టీసీ.


ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ 


ఛార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ. బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866-2570005 లను కేటాయించింది. దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పండగ వేళ ఆర్టీసీ నిర్వహిస్తున్న ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు.