Andhra Pradesh liquor scam:  ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌లో  ఏడుగురు ముఖ్య నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను ఆంటీ-కరప్షన్ బ్యూరో  కోర్టు తిరస్కరించింది.  వైసీపీ ఎంపీ పీ.వి. మిధున్ రెడ్డితో పాటు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరో ఇద్దరు బెయిల్ పొందారు. వారి బెయిల్స్ రద్దు చేయాలని సిట్ హైకోర్టును ఆశ్రయించింది.  ఈక్రమంలో తమకూ బెయిల్స్ వస్తాయని  ఆశించిన నిందితులకు ఎదురు దెబ్బ తగిలింది.  రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి,భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.                             

Continues below advertisement

ఈ నిందితులు అక్రమ డబ్బు రవాణా, లైసెన్సు కుంభకోణాల్లో పాలుపంచుకున్నారని దర్యాప్తులో తేలిందని సిట్ చెబుతోంది. వారు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఏడుగురు నిందితులు వేర్వేరుగా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదులు  వాదనలు వినిపించారు. నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలని, దర్యాప్తులో సహకరిస్తామని వాదించారు. అయితే, ఏసీబీ తరపు న్యాయవాదులు నేరం తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు పూర్తి కాకపోవడాన్ని ఆధారంగా చూపి వ్యతిరేకించారు.                     

వాదనలు పూర్తయిన తర్వాత, ఏసీబీ కోర్టు అందరి పిటిషన్‌లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. "నేరం తీవ్రమైనది, దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్‌కు అర్హత లేదు" అని కోర్టు స్పష్టం చేసింది. హైకర్టు .. బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వచ్చే వరకూ ..  దిగువ కోర్టు   బెయిల్ పిటిషన్లను విచారించవద్దని సూచించింది. ఈ తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీం కోర్టు ఇటీవల హైకోర్టు ఆర్డర్‌లపై జోక్యం చేసుకుని, బెయిల్  పిటిషన్‌లు మెరిట్స్‌పై విచారించమని ఆదేశించింది. దీంతో విచారణ జరిపిన ఏసీబీ కోర్టు బెయిల్స్ ను తిరస్కరించింది.                

Continues below advertisement

 మద్యం కుంభకోణం  కేసులో  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( నిందితుల్లో A-38గా ఉన్నారు.  ఆయనను జూన్ 18,న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు.  వెంకటేష్ నాయుడుతో కలిసి శ్రీలంకకు  వెళ్తుండగా సిట్ అధికారులు  అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో హాజరు చేశారు. అప్పటి నుంచి  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  రాజ్ కేసిరెడ్డి  ఏప్రిల్ లో అరెస్టయ్యారు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు చురుకుగా సాగుతోంది. కొంత మంది బెయిల్ రావడంతో..దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని సిట్ అధికారులు అంటున్నారు. బెయిల్ వస్తుందని చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో .. పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.