Council Chairman issues notices  to resigned YCP MLCs: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన లుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. మండలి చైర్మన్ నోటీసులు అందుకున్న వారిలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత,  జయమంగళ వెంకటరమణ  ఉన్నారు. వీరు గతంలోనే వైసీపీకి రాజీనామా చేసి, ప్రస్తుతం టీడీపీ, జనసేన వంటి కూటమి పార్టీల్లో కొనసాగుతున్నారు. చైర్మన్ వీరిని వ్యక్తిగతంగా పిలిచి, వారు తమ రాజీనామాలను స్వచ్ఛందంగానే సమర్పించారా? లేక ఎవరి ప్రోద్భలంతోనైనా, ప్రలోభాలకు లోనై చేశారా? అనే అంశాలపై ఆరా తీయనున్నారు.                      ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను ఆమోదించడంలో జాప్యం జరుగుతోందని, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ గతంలో జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్‌కు దిశానిర్దేశం చేసింది.   చైర్మన్ మోషేన్ రాజు ఇప్పుడు చర్యలు వేగవంతం చేస్తూ, రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో  వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.                      వైసీపీకి శాసనసభలో బలం తక్కువగా ఉన్నప్పటికీ, శాసన మండలిలో ఇప్పటికీ ఆధిక్యం ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవీకాలం ఇంకా మిగిలి ఉన్నందున, వారి రాజీనామాలను ఆమోదిస్తే ఆ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్తే మండలిలో వైసీపీ తన మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ రాజీనామాలను ఆమోదించకుండా అనర్హత వేటు వేసే దిశగా చైర్మన్ ఆలోచిస్తున్నారా  అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.                     ఇప్పటికే పలుమార్లు చైర్మన్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరిన ఎమ్మెల్సీలు, తాము స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేసే హక్కు మాకు ఉంది, దీనిపై విచారణ పేరుతో జాప్యం చేయడం సరికాదు " అని వారు వాదిస్తున్నారు. జయమంగళ వెంకటరమణ వంటి నేతలు కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇటీవల జయమంగళ వెంకటరమణ.. తనకు జగన్ దేవుడని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గుతారన్న ప్రచారం జరుగుతోంది.  జయమంగలను ఫిబ్రవరి 25న విచారిస్తారు. మిగిలిన వారిని ఇరవై ఆరో తేదీన ప్రశ్నించారు.  ఈ విచారణ తర్వాత చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.