Tulasi Reddy on CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకే స్మార్ట్ మీటర్లు అనడం పచ్చి అబద్దమని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. ఇది కేవలం జగన్ మోహన్ రెడ్డి రూ. 9 వేల కోట్లు మిగుల్చుకోవడం కోసం మాత్రమేనని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం ఎత్తివేత, కమీషన్ ను కాజేసేందుకే ఇలా మీటర్లు బిగిస్తున్నారని కడపలో జరిగిన మీడియా సమావేశంలో తులసి రెడ్డి విమర్శలు గుప్పించారు. 


విద్యుత్ మీటర్లు బిగిస్తే అన్నదాతలు అప్పులపాలు కావాల్సిన దుస్థితి తలెత్తుతుందని వెల్లడించారు. వ్యవసాయం కూడా మానుకొని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. మాట తప్పడం మడమ తిప్పడం ఇప్పుడు జగన్ దినచర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి రాకముందు నవరత్నాలు భాగంగా మద్యపానం నిషేధం చేస్తామని మాట తప్పారని గుర్తు చేశారు. మూడు రాజధానుల ముసుగులో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే తీవ్రంగా నష్ట పోయేది రాయలసీమ వాసులే అని అన్నారు.


విద్యుత్ మీటర్లతో భయపడాల్సిందేం లేదంటున్న మంత్రులు


విద్యుత్ మీటర్లపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని మరోవైపు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. కరెంటు బిల్లులు వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతు కట్టాల్సిన అవసరం లేదని ఏపీ సర్కారు చెబుతోంది. ప్రతి నెలా బిల్లు రాగానే.. రైతు ఖాతాకు ఎంత బిల్లు వచ్చిందో అంత మొత్తం జమ చేస్తామని.. ఆ బిల్లు ఆటోమేటిక్ గా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తారని, రైతులు కట్టాల్సిందేం లేదని అంటోంది. 


వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపు విషయమై ఒక్క పైసా తీసుకోవడం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత నెల అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపుతో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లుగా జగన్ వివరించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోతే రైతు నష్టపోతాడని సీఎం తెలిపారు. వ్యవసాయ మీటర్ల బిగింపు విషయమై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు.


రైతుల్లో భయం ఎందుకంటే?


గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఎత్తివేసి.. ఎంత సబ్సిడీ ఇస్తున్నామో.. అంత మొత్తం వినియోగదారు ఖాతాలోకి మళ్లిస్తామని కేంద్రం ఓ సంస్కరణ తీసుకొచ్చింది. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆందోళనలు చేసింది. చివరికి ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయం వద్దనుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే.. తాము వ్యతిరేకించిన నగదు బదిలీని అమలు చేయడం ప్రారంభించారు. మొదట్లో   నాలుగు, ఐదు వందలు వచ్చే సబ్సిడీ  ఇప్పుడు రూ. 40కి పడిపోయింది. పోనీ గ్యాస్ సిలిండర్ ధర ఏమైనా తగ్గిందా అంటే ఇంకా పెరిగిపోయింది. విద్యుత్‌కూ ఇలా చేయరన్న గ్యారంటీ ఏముందని భయపడుతున్నారు.