CM Ramesh comments on BRS merger with BJP:  విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కేటీఆర్ అసహనంతో ఉన్నారని సీఎం రమేష్ ఆరోపించారు. సీఎం రమేష్ కుటుంబానికి చెందిన సంస్థకు ఫ్యూచర్ సిటీలో ఓ రోడ్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టుకు సీఎం రమేష్ సహకరించారని.. అందుకే ఫ్యూచర్ సిటీలో ఆయనకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు రేవంత్  దోచి పెడుతున్నారని విమర్శించారు. 

ఈ ఆరోపణలపై సీఎం రమేష్ అనకాపల్లిలో స్పందించారు. బీజేపీతో విలీనానికి సహకరించాలని తన ఇంటికి వచ్చి కేటీఆర్ కోరారన్నారు.  విలీనంపై మాట్లాడాలని నా ఇంటికి వచ్చి రిక్వస్ట్ చేశారా లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. మా ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది..కావాలంటే ఆ సీసీ టీవీ ఫుటేజీ ఇస్తామన్నారు. ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కవితతో సహా ఎవరిపైనా విచారణ వద్దని.. అన్నీ ఆపేస్తే.. తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని  .. సహకరించాలని కోరిన మాట నిజం అవునో కాదని చెప్పాలన్నారు. విలీనానికి  బీజేపీ ఒప్పుకోలేదని కూడా చెప్పానన్నారు. కమ్మవాళ్లను నమ్మేది లేదని కూడా కేటీఆర్ అన్నారన్నారు. తన ఇంటికి రాలేదని.. విలీనంపై చర్చించలేదని కేటీఆర్ ఇష్టదైవం మీద ప్రమాణం చేయగలవా అని సవాల్ చేశారు. 

ఫ్యూచర్ సిటీలో తనకు ఏ కాంట్రాక్ట్ లేదన్నారు. నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి ప్రాజెక్టు వచ్చిందన్నారు.  సీఎంగా ఉన్నంత మాత్రాన కాంట్రాక్టులు ఎవరికి కావాలనుకుంటే వారికి ఇవ్వగలరా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లు అలాగే చేశారా అని నిలదీశారు. పదేళ్ల కాలంలో ఎవరెవరికి ఎన్నెన్ని కాంట్రాక్టులు ఇచ్చారో లెక్కలు తీద్దామని సవాల్ చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని.. బీార్ఎస్ హయాంలో కాంట్రాక్టులు ఎవరు చేశారో లెక్కలు తీయాలన్నారు.  మీరు అనుకున్నది జరగలేదని తనపై బురద చల్లడం ఏమిటని  సీఎం రమేష్ ప్రశ్నించారు.  కేటీఆర్ చేసినవన్నీ సీరియల్‌గా చెబుతామని.. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 

కేటీఆర్ పదేళ్లు ఏం చేశారో అ్నీ తెలుసున్నారు.  కేటీఆర్ అమెరికా, మాల్దీవులు ఎలా వెళ్లారో తెలుసని.. అన్నీ సీబీఐ, ఈడీకి ఇస్తానన్నారు.  టీడీపీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డితో స్నేహం ఉందన్నారు.  రాజకీయంగా ఎదిగిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ అందర్నీ మర్చిపోయారన్నారు. తాము అలా కాదని.. రాజకీయం వేరు.. స్నేహంవేరని  స్పష్టం చేశారు.           

కంచ  గచ్చిబౌలి భూములను  తాకట్టు పెట్టడంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందని గతంలో కేటీఆర్ ఆరోపించారు. అప్పట్లో ఆ పేరు ఆయన బయట పెట్టలేదు.  కానీ ఇప్పుడు రుత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఫ్యూచర్ సిటీలో ఓ కాంట్రాక్ట్ దక్కడంతో.. రేవంత్ రెడ్డి ఆయనకు ఇచ్చిన  ప్రతిఫలం అని కేటీఆర్ ఆరోపణలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టడంలో రేవంత్ కు సీఎం రమేష్ సహకరించారని కేటీఆర్ చెప్పారు.