ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెలాఖరులో ఆయన కుటుంబసభ్యులతో కలిసి యూరప్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రోజుల పాటు లండన్, పారిస్‌లలోని పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించే అవకాశం ఉంది. అయితే జగన్ వెళ్లేది వ్యక్తిగత పర్యటనే కానీ పర్యాటక ప్రాంతాలు చూసేందుకు కాదని కుమార్తె చదువు అంశంపై అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షా రెడ్డి గతంలో లండన్‌లోని ప్రసిద్ధ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ అయిన ఇన్‌సీడ్ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నారు.
గత ఏడాది ఆగస్టులో ఆమె ఇన్‌సీడ్ క్యాంపస్‌లో చేరేందుకు వెళ్లే సమయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేర్పించడానికి 2017లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ స్వయంగా లండన్ వెళ్లారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించే ముందు ఓ సారి కుమార్తెను చూసి వచ్చారు. అక్కడ ఇన్‌సీడ్ క్యాంపస్‌లో జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి.. అందుకే వెళ్తున్నారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చిన్న కుమార్తె కూడా అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారు. కరోన ాకారణంగా ఆమె ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డికి ఇది మూడో విదేశీ పర్యటన. ఇంతకు ముందు జరిపిన రెండు పర్యటనలు కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనలే. బాధ్యతలు చేట్టిన కొత్తలో ఓసారి జెరూసలెం వెళ్లారు. అది ఆధ్యాత్మిక పర్యటన. ఆ తర్వాత మరోసారి ఆమెరికా వెళ్లారు. తన చిన్న కుమార్తెను అక్కడ ఓ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లారు. అది కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనే. అయితే అక్కడ వైసీపీ ఎన్నారై విభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు యూరప్‌కు వెళ్లడం మూడో విదేశీ పర్టన అవుతుంది.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ షరతుల్లో భాగంగా.. ఆయన విదేశాలకు వెళ్లాలంటే.. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డిప్లమాటిక్ పాస్ పోర్ట్ తీసుకున్నారు. డిప్లమాటిక్ పాస్ పోర్టుతో చాలా దేశాలకు వీసా తీసుకోకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. కానీ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో పర్మిషన్ తీసుకున్నారో లేదో స్పష్టత లేదు.