CM Jagan :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల తరచూ అనుకోకుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది.  తాజాగా విశాఖలో మధురవాడలో ఐటీ హిల్స్‌లో  అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం... అక్కడ్నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం హెలికాఫ్టర్ ను రెడీ చేశారు. అయితే అనూహ్యంగా వర్షం పడుతూండటంతో హెలికాఫ్టర్ ఎగరడానికి అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కాసేపు చూసిన సీఎం జగన్ వర్షం ఆగేలా లేకపోవడం.. సమయం మించి  పోతూండటంతో  రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని  నిర్ణయించుకున్నారు. మధురవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. 


దీంతో అధికారులకు ముందుగా అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయించారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం వెళ్తున్నారన్న విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాతనే విషయం తెలిసింది.  వర్షం పడుతున్నప్పటికీ ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం వెళ్లడానికి ఎలాంటి సమస్యలు ఎదురు కాకపోవడంతో బయలుదేరి వెళ్లారు. ఇటీవల అనంతపురం జిల్లాలో ఇలా హెలికాఫ్టర్ మొరాయించడంతో నార్పల నుంచి  పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ సమయంలో దారిలో  కొన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అడ్డుకున్నారు. ఈ ఘటనతో ముందస్తుగా రోడ్డు మార్గ ప్రయాణాలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 


మొదట గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ మీదుగా సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ ద్వారా బోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత హెలికాఫ్టర్ లో మధురవాడ వచ్చారు.  మధురవాడలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు.                                                  





 అయితే ఆ తర్వాత వర్షం పెరగంతో .. హెలికాఫ్టర్ టేకాఫ్‌కు సమస్యలు ఏర్పడ్డాయి. భద్రతా కారణాలతో అధికారులు అంగీకరించకపోవంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది.