CM Jagan Tirupati Tour : సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు అయింది. గురువారం(జూన్ 23) ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. ఉదయం 11.15 – 11.45 గంటల వరకు తిరుపతి వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) ఫుట్ వేర్ తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ-1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గం. 2.40 లకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 


సీఎం జగన్ కు ఆహ్వానం 


వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణకు సీఎం జగన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి సోమవారం ఆహ్వానించారు. తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ వద్ద)లో నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గన్మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ. ధ‌ర్మారెడ్డి క‌లిసి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందించి, శాలువతో సన్మానించారు. వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వాదం చేశారు. జూన్ 18వ తేదీ నుంచి వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. జూన్ 23వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 


వకుళ మాత ఆలయం


తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో పాతకాల్వ పేరూరు బండపై వకుళమాత ఆలయం ఉంది. సుమారు 320 ఏళ్ల క్రితం హైదర్‌ అలీ దండయాత్రల్లో ఈ ఆలయం దెబ్బతింది. ఇందులోని విగ్రహం కూడా కనిపించకుండా పోయింది. ఈ ఆలయం చుట్టూ కొండను మైనింగ్‌ మాఫియా కొల్లగొట్టింది. వందల ఏళ్ల పాటు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న ఆలయం పూర్తిగా పాడైపోయింది. ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి చొరవ చూపారు. ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పునర్మించారు. ప్రస్తుతం ఆలయ మహాసంప్రోక్షణ పనులు జరుగుతున్నాయి. జూన్ 23న ఆలయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆలయానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు.