CM Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ వైఎస్సార్‌కు నివాళులర్పించారు. శనివారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
అంతకుముందు ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయారు. పాలేరులో బహిరంగసభ లో ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
సీఎం జగన్ మూడు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకుంటారు. గండిపేట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని కెనాల్ డెవలప్‌మెంట్ ఫేజ్ –1 పనులను ప్రారంభించనున్నారు. పులివెందులలోని నూతనంగా నిర్మించిన వైఎస్సార్ ఐఎస్‌టిఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. జులై 10న ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.