ఏప్రిల్15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయాలని ఆయన సూచించారు.
వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష...
వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రబీ ధాన్యం సేకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్ స్థితిగతులను గురించి సీఎం జగన్ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు.
రబీ సన్నాహకాలపై సీఎం సమీక్ష...
రబీ సన్నాహకాల పై కూడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 100 శాతం ఇ -క్రాపింగ్ పూర్తైందని అథికారులు వెల్లడించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు వ్యవహరంలో అదికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని,ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని జగన్ అన్నారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు సీఎంకు వివరించారు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
పొలం బడిపై ప్రత్యేక శిక్షణ...
పొలం బడి కార్యక్రమం నిర్వాహణపై అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు నివేదికను సమర్పించారు. పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని, ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతుల పై శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15 శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, ఇక పత్తిలో 16 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయని అధికారులు నివేదిలో స్పష్టం చేశారు. పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఈ పరిస్దితులు దోహదపడతాయని, 26 ఎఫ్‌పీవో(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కీలకంగా వ్యవసాయ పరికరాల పంపిణీ...
రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. యాంత్రికీకరణ పెరిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్న సీఎం, ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ చేయాలన్నారు. జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ చేపట్టేందుకు అవసరం అయిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేయాలని చెప్పారు.
మిల్లెట్స్ సాగుపై....
రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును మరింత ప్రోత్సహించాలని జగన్ అన్నారు. 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు ను ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా అదికారులు సీఎం జగన్ కు వివరించారు. 3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Harish
Updated at:
29 Mar 2023 11:27 PM (IST)
రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ పై జగన్ సమీక్ష
NEXT
PREV
Published at:
29 Mar 2023 11:27 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -