ఎపీ సీఎం జగన్ జిల్లాల వారీగా పర్యటనల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న కృష్ణా జిల్లాలో, 26న విశాఖపట్టణంలో సీఎం పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. 25వ తేదీ గురువారంనాడు సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబందించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమం, లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు పెడన చేరుకుంటారు, 10.50 నుంచి 12.30 గంటల వరకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం ప్రసంగం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.
పెడన అంటేనే చేనేత...
కృష్ణాజిల్లాలో 5,192 మగ్గాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 18, 027 మంది నేతన్నలు తమ వృత్తిలో కొనసాగుతున్నారు. చేనేత పరిశ్రమ గత 500 ఏళ్లుగా ఈ ప్రాంతంలో స్దిరపడింది. పెడన పట్టణంలోనే 5, 800 మంది నేత పనిలో నిమగ్నమై ఉన్నారు. పెడనలో నూలుతో మెత్తటి వస్త్రాలు తయారు చేస్తారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న చేనేత సహకార సొసైటీలు 7 ఉంటే, కృష్ణా జిల్లాలో 37 చేనేత సహకార సహకార సొసైటీలు ఉన్నట్లు సమాచారం. మచిలీపట్నం, పెడన, కప్పల దొడ్డి, ఆకులమన్నాడు, పోలవరం, రాయవరం, మల్లవోలు, చిన్నాపురం, చల్లపల్లి, శివరామదుర్గాపురం, పురిటిగడ్డ, ఘంటసాల, కాజా, గన్నవరం, ముస్తాబాద్, గుడివాడ, కనిమెర్ల, ఉప్పులూరు తదితర ప్రాంతాల‌్లో ప్రజలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత..!
ఏపీ సీఎం జగన్ చేనేత పరిశ్రమకి చేయూత అందించేందుకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నారు. నేతన్నలకు అండగా నిలబడుతున్నట్టు చెబుతున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద కరోనా వంటి సమయంలో కూడా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. గతేడాది అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను జమ చేయడం దేశ చరిత్రలోనే ప్రప్రథమం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మగ్గం ఉండి.. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
ఇప్పటికే 3 విడతల్లో సాయం అందగా తాజాగా నాల్గో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది 2022 - 23 ఆర్థిక సంవత్సరానికిగాను కృష్ణా జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన 4,100 మంది నేతన్నలకు 9 కోట్ల 84 లక్షల రూపాయలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 25 వ తేదీన (రేపు) పెడన నియోజకవర్గం తోటమూల నుంచి నేరుగా అర్హులయిన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఎల్లుండి విశాఖకు సీఎం జగన్...
ఆగస్టు 26వ తేదీ అంటే ఎల్లుండి సీఎం జగన్ విశాఖపట్నం జిల్లాలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది ఓషన్స్‌తో ఒప్పందం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధృవ పత్రాలను సీఎం చేతులు మీదగా అందించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, 10.20 నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహనా ఒప్పందం, అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం, తర్వాత అక్కడి నుంచి బయల‌్దేరి సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకోనున్నారు. 11.23 నుంచి 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందిస్తారు. అక్కడే విద్యార్ధులతో ముఖాముఖి, అనంతరం సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.