ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం అయిన ఆస్కార్ గెల్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ అవార్డుతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగిందని ట్వీట్ చేశారు. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారని సీఎం జగన్ కొనియాడారు. తెలుగువారినే కాక, భారతదేశం మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.
‘‘తెలుగు జెండా మరింత పైకి ఎగిరింది. ఈ తెలుగు పాట మనకు ఎంతో గర్వకారణం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా మన జానపద వారసత్వాన్ని చాటింది. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారు.
ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇంకా ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలుగు వారినే కాక, దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’’ అని సీఎం ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ అభినందనలు
ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయితను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం మనసారా అభినందించారు.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, పాట కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం ప్రశంసించారు. ఈ అవార్డు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్ భారత దేశానికి గర్వకారణం అన్నారు.