ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని.. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధిచేసుకుంటూ ముందుకుసాగుతోందన్నారు. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారని.. అయితే పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మనపై విమర్శలు చేస్తున్నారు, వక్రీకరణలు చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఛాలెంజ్‌గా తీసుకుని ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను తయారు చేయాలని ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ.2500 కోట్లు .. పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.
రోడ్ల కోసం ప్రతి జిల్లాలో గతంలో ఎంత ఖర్చుచేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం ? అన్నదానిపై వివరాలను ప్రజల ముందు ఉంచాలని జగన్ సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశాం.. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి, పెండింగ్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. ఇవన్నీ కూడా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికిన దీనిమీద దృష్టిపెట్టాలి, వచ్చే ఏడాదిలోగా ఇవి పూర్తికావాలన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమైనది, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత పాటించాల్సిందేనని.. నిర్దేశించిన ప్రమాణాలు ప్రకారం రోడ్లు వేయాలని ఆదేశించారు. ఉమ్మడి వైయస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టులు శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు.
నివర్ తుపాను కారణంగా ఉమ్మడి వైయస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దెబ్బతిన్న బ్రిడ్జిలు తదితర నిర్మాణాలకోసం దాదాపు రూ.915 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా 99 పనులు .. రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్‌హైవేలను కనీసంగా 10 మీ. వెడల్పుతో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో మరో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని ప్రభుత్వం తెలిపింది. వీటికి ఏడాదిలోగా భూ సేకరణ పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నారు. 3004 కి.మీ. నిడివి ఉన్న ఈ రహదారులకోసం దాదాపు రూ.41,654 కోట్లు ఖర్చు చేయాలని జగన్ నిర్ణయించారు.
పంచాయతీరాజ్ రోడ్లను రూ.1072.92 కోట్లతో బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 నుంచి 2022 వరకూ మొత్తంగా 3,705 కి.మీ మేర పంచాయతీరాజ్ రోడ్ల కొత్త కనెక్టివిటీ, అప్‌గ్రేడేషన్ జరిగిందని ఇప్పటికే . 2131 కోట్లు ఖర్చు చేశామని అధికారులు ప్రకటించారు. ఏపీలో రోడ్లు పరిస్థితిపై అన్ని ైపుల నుంచి విమర్శలు వస్తూండటంతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.