AP Assembly Elections 2024:  ఎన్నికల్లో గిద్దలూరు నుంచి తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గిద్దలూరులో వైసీపీ నుంచి తానే బరిలో ఉంటానని అన్నా రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని చెప్పారు. 2018 డిసెంబర్‌లో తనను నమ్మి సీటు ఇచ్చారని, 2024లో సైతం సీఎం నుంచి అదే భరోసా దక్కిందని హర్షం వక్తం చేస్తున్నారు. తాను విలువలతో కూడిన, చేసిన రాజకీయాలకు అది గుర్తింపు అన్నారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా ప్రజలందరి  దీవెనలతో రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి తనను పోటీ చేయమని సీఎం జగన్ ఆదేశించారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోటీలో ఉంటానన్నారు. 


అన్నా రాంబాబు ప్రకటనపై వైసీపీలో సీటు ఆశిస్తున్న నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గత రెండు సార్లు సీటు ఆశించి భంగపడ్డ ఐవీ రెడ్డి లాంటి సీనియర్ నేత అన్నా రాంబాబు నేతలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇప్పటి వరకు సీటు ఎవరికీ కేటాయించలేదన్నారు. సర్వేలు, ప్రజా బలం, సామాజిక వర్గాల ఆధారంగా 2024 ఎన్నికల్లో సీటు కేటాయించే అవకాశం ఉందన్నారు. ప్రకాశం జిల్లా  రీజనల్ ఇన్‌చార్జి విజయ్ సాయి రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు పరిశీలిస్తున్నారని సీటు ఎవరికి కేటాయించాలో త్వరలోనే ప్రకటిస్తారని అన్నారు. సీటు కేటాయించారంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. 


పోటీలో డాక్టర్ బ్రహ్మానందరెడ్డి
గిద్దలూరు నియోజకర్గం నుంచి వైసీపీ సీటు ఆశించే వారి జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇప్పటికే వైవీ రెడ్డి లాంటి సీనియర్ నేత సీటు ఆశిస్తుండగా జాబితాలోకి మరో వ్యక్తి చేరారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ వైద్యుడు బ్రహ్మానందరెడ్డి సీటు కోసం పోటీపడుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో రూపాయికే వైద్యం అందిస్తున్నారు. 


అన్నాకు ఎసరు పెడుతున్న గ్రూపు రాజకీయాలు
గిద్దలూరు నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. మూడు మండలాలకు చెందిన ఓ సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యేపై అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మూడు మండలాలకు చెందిన నేతలు సైతం ప్రత్యేకంగా క్యాంపు రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీడీపీ నుంచి తనతో పాటు వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి అసమ్మతి నేతలు సమావేశం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీ సైతం ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారి జాబితాలో చేరారు. నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలతో ఎక్కువగా మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే సీటు వస్తే సహకరించాలని కోరుతున్నారు. ఏం కావాలంటే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇస్తున్నారు.