CM Jagan In Vizag Summit :  ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల పారిశ్రామికవేత్తల నుంచి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ ప్రకటించారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.  13 లక్షల కోట్ల పెట్టుబడుల  గురించి చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల  6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని. శుక్రవారం రూ. 8.54 లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతాయని వైఎస్ జగన్ ప్రకటించారు.  ప్రస్తుతం ఆరు పోర్టులు..  ఆరు ఎెయిర్ పోర్టులతో అత్యధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉన్నదని సీఎం  జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం తెలిపారు. 


గ్రీన్ ఎనర్జీపై ప్రధానంగా ఫోకస్                                             


దేశ ప్రగతికి ఏపీ కీలకంగా మారిందని  గ్రీన్ ఎనర్జీపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగాయని గుర్తు చేశారు. పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామన్నారు. 


భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యం:  ముఖేశ్‌ అంబానీ                                  


భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ 90శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది : జీఎమ్మార్                                            


ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు. ఇందుకు అనేక గణాంకాలు ఉదాహరణగా ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ద్వారా లక్ష ఉద్యోగాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు తరలిరావాలని జీఎంఅర్ సైతం పిలుపునిస్తుందన్నారు.


ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయం : అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి             


ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయమని అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి పేర్కొన్నారు. ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎ‍స్పార్‌ సేవలను ప్రీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.