Polavaram Project : ఆంధ్రా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తోన్న పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ వద్ద సీఎం సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ చేశారు. ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి గ్యాప్ 1, ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం.. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతని అడగ్గా.. సుమారు రూ.12 వందల కోట్లకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్టుపై సమీక్షించి, పనుల షెడ్యూల్ ప్రకటించారు. 


పోలవరం, అమరావతి.. రాష్ట్రానికి రెండు కళ్లు


పోలవరం ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు. పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం అన్నారు. 


Also Read : Dhanurmasam : తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసం ప్రారంభం -తిరుమల సహా వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణం 


72 శాతం పనులు పూర్తి


2 కి.మీ. పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫ్రమ్ వాల్‌కు శ్రీకారం చుట్టామని.. ఈ వాల్‌ను 414 రోజుల్లో పూర్తి చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు 72 శాతం పనులు పూర్తి చేశామన్న సీఎం.. 28 సార్లు క్షేత్రపరిశీలన చేశానని, 82 సార్లు వర్చువల్‌గా రివ్యూలు చేశానన్నారు. 2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు కష్టపడి పని చేశామని సీఎం తెలిపారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32.2015 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డు కూడా బ్రేక్ చేశామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. 


నీటి సమస్యకు చెక్


పోలవరం ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగముంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు, చిత్తూరు, తిరువతి వరకు ఎలాంటి నీటి సమస్య ఉండదన్నారు. ప్రాజెక్ట్ ప్రాముఖ్యత విషయానికొస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందని, 93 మీటర్ల డయాఫ్రమ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇలా అనేక ప్రయోజనాలిస్తుంది పోలవరం ప్రాజెక్టు అని కొనియాడారు.


ఇకపోతే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనతో నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. తాము ఎన్నాళ్లుగానో కలలు కంటోన్న ప్రాజెక్టు 2026 వరకల్లా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చెప్పినట్టుగానే ప్రభుత్వం కూడా ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసింది. త్వరలోనే రాష్ట్రానికి నీళ్లిచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. 


Also Read : TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !