Hyderabad Plus Amaravati Global City:  రాజధాని అమరావతిని యావత్ దేశం గర్వించే నగరంగా, హైదరాబాద్ ప్లస్  స్థాయిలో నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో అమరావతి నగర నిర్మాణ పురోగతిపై ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్‌సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ వంటి ప్రముఖ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ - ప్రైడ్ ఫర్ ఇండియా అని అభివర్ణించిన ఆయన.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు కాంట్రాక్టర్లు గర్వపడాలని, నిర్దేశిత గడువు కంటే ముందే పనులను పూర్తి చేసి తమ బ్రాండ్ వాల్యూను చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని పనుల పురోగతిని తానే స్వయంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని సీఎం తేల్చిచెప్పారు.

Continues below advertisement

అమరావతిలో రూ.50,999 కోట్ల విలువైన పనులు

ప్రస్తుతం అమరావతిలో రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని, ప్రస్తుతం అవి వేగంగా జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్‌ఫ్రా, ఎల్పీఎస్ ఇన్‌ఫ్రాతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల వంటి ఐకానిక్ భవనాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. పనుల వేగాన్ని మరింత పెంచేందుకు అవసరమైన మానవ వనరులు, అధునాతన యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో 26,924 మంది కార్మికులు, 5,140 కి పైగా భారీ యంత్రాలు నిరంతరం నిమగ్నమై ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. 

Continues below advertisement

భవిష్యత్ గ్లోబల్ సిటీ

భవిష్యత్ గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి ఎలాంటి వరద ముప్పు లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేలా వాటిని వెడల్పు చేసే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కొందరు వ్యక్తులు కావాలనే లిటిగెంట్లుగా మారి రాజధాని పనులను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించకుండా, రాష్ట్ర ప్రజల సర్వోన్నత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనుల్లో మరింత దూకుడు ప్రదర్శించాలని కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు.

కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు కీలక సూచనలు

గత పాలకులు ఐదేళ్ల పాటు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా పడకేయించారని, గత రెండేళ్లుగా అహర్నిశలు శ్రమించి రాజధానిని మళ్లీ పక్కాగా గాడిలో పెట్టామని సీఎం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లతో పునీతమైన ఈ నేలపై అత్యుత్తమ నివాసయోగ్య నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. పనుల వేగంతో పాటు నాణ్యత  విషయంలో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ప్రపంచస్థాయి ఐకానిక్ నిర్మాణాలుగా నిలవాలని దిశా నిర్దేశం చేశారు. అమరావతికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చేలా మౌలిక సదుపాయాల కల్పన ఉండాలని, కాంట్రాక్టు సంస్థలు ఆ దిశగా అంకితభావంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాజధాని నిర్మాణ పనులన్నీ అనుకున్న గడువు ప్రకారం పూర్తయిన తర్వాత.. ఈ చారిత్రాత్మక నగర భవనాల గ్రాండ్ ఓపెనింగ్  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.