CM Chandrababu Comments In Mangalagiri AIIMS Graduation Ceremony: మంగళగిరి ఎయిమ్స్‌కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం తరఫున వెంటనే 10 ఎకరాల భూమి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ భూమి చాలా సుందర ప్రదేశంలో ఉందని.. రాజధాని అమరావతికి ఎయిమ్స్ (AIIMS) ఓ సిగలా ఉంటుందని అన్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కు కూడా ఇలాంటి భూమి లేదని.. అమరావతి భారతదేశ భవిష్యత్ సిటీ అని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నెంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 960 బెడ్లు, రూ.1,618 కోట్ల ఖర్చుతో మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి జరిగిందని చెప్పారు. డాక్టర్లుగా ఎదగడానికి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలన్న డైరెక్టర్ సూచన మేరకు.. AIIMS, IIT సంయుక్తంగా కొలనుకొండ వద్ద ఏర్పాటు చేయబోయే... Medtronicsకు పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
'స్టూడెంట్‌గా చదవాలని ఉంది'
అవకాశం ఉంటే ఇక్కడ స్టూడెంట్‌గా చదవాలని ఉందంటూ సీఎం చంద్రబాబు అన్నారు. రూ.10కే వైద్యం దొరికే ప్రదేశం ఎయిమ్స్ అని.. అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులూ సమకూరుస్తామని చెప్పారు. 'రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఓ ఉదాహరణ. అవకాశం ఉంటే నాకు ఇక్కడ చదువుకోవాలని ఉంది. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్‌గా మారిపోయింది. డీప్ టెక్‌ను మెడికల్‌లో కూడా అమలు చేయాలనుకుంటున్నాం.' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
'యువ వైద్యులు గ్రామాల్లో సేవలందించాలి'
యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. 'వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి.' అని పేర్కొన్నారు.