Chintakayala  Vijay CID :   టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్లారు. 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. చింతకాయల విజయ్ ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో 'భారతి పే' పేరిట పోస్టులు పెట్టినట్టు చింతకాయల విజయ్ పై కేసు నమోదయింది.  ఈ కేసులోనే తాజాగా నోటీసులు ఇచ్చారు.


ఐ టీడీపీ పేరుతో భారతి పే అనే పోస్టర్లు వేశారని కేసు 


ప్రస్తుతం చింతకాయల విజయ్ టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉన్నారు. పాదయాత్ర సన్నాహాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఖచ్చితంగా పాదయాత్ర ప్రారంభం రోజే ఆయనను విచారణకు పిలువడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం అయిన ఐ టీడీపీకి చింతకాయ విజయ్ ఇంచార్జ్ గా ఉన్నరాని.. ఆయన సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత పోస్టు పెట్టారని గత అక్టోబర్‌లో సీఐడీ కేసు పెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో ఐటీడీపీ ట్విటర్‌ అకౌంట్ నుంచి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని.. దీని వెనుక చింతకాయల విజయ్‌ పాత్ర ఉన్నట్లు సీఐడీ చెబుతోంది. ఈ ఆరోపణలతో టీడీపీ నేత విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ క్రైమ్‌ నంబర్‌ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌విత్‌ 34, ఐటీ చట్టం సెక్షన్‌ 66(సి) కింద కేసు ఫైల్ చేసింది. 


హైదరాబాద్‌లో గతంలో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు 


హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో  పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పెద్ద వివాదం రేగింది. తన కుటుంబసభ్యులను వేధించారని ఆయన ఆరోపించారు. ఈ కేసుపై తర్వతా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చింతకాయల విజయ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు..   ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీఐడీకి సూచించింది. ఆ తర్వాత కూడా సీఐడీ నోటీసులు జారీ చేశారు.   విజయ్ తరపు న్యాయవాది హైకోర్టులో సవాల్ చేశారు.  న్యాయమూర్తి ముందు విజయ్ తరపు న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ నివాసం నర్సీపట్నంలో ఉంటే హైదరాబాద్‌లో నోటీసులు ఇవ్వడం‌పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. 


గతంలో ఈ కేసులో హైకోర్టుకు వెళ్లి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్న  చింతకాయల విజయ్ 


ఐటీడీపీ కోసం ఉపయోగిస్తున్న గాడ్జెట్స్‌ను తేవాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. ఐటీడీపీతో తమకు సంబంధం లేదన్న విజయ్ తరపు లాయర్ వాదించారు.  వాదనల సందర్భంగా దర్యాప్తులో భాగంగా సేకరించాల్సిన ఆధారాలను నిందితులే తీసుకురావాలని ఆదేశించడం ఏంటని.. ఇలాంటి చర్యలకు అనుమతిస్తే, భవిష్యత్తులో కన్‌ఫెషన్‌ స్టేట్‌మెంట్ ఇవ్వాలంటారని సీఐడీపై సీరియస్ అయ్యింది.