Chittoor News :  బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలతో సేవలు మరింత సులభంగా మారుతున్నాయి. దేశ, విదేశాల నుంచి ఎక్కడికైనా నగదును సులువుగా బదిలీ చేసుకొనే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇంటర్నెట్ లో వస్తున్న మార్పులతో బ్యాంకింగ్ రంగంలో శరవేగంగా సాఫ్ట్ వేర్ లు అభివృద్ధి అవుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, ఇలా ఎన్నో యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. నగదు లావాదేవీలు క్షణకాలంలోనే ఎవరికైనా పంపే సౌలభ్యం ఉంది. అలాంటి బ్యాంకింగ్ సెక్టార్ లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కనివిని ఎరుగని రీతిలో అందరూ అవాక్ అయ్యేలా ఓ ఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమమేమో అనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సమస్యలు చూసిన అధికారులకి ఇలాంటి సమయాలు కూడా ఎప్పుడు ఎదురై ఉండవు. ఒకే పేరు, ఒకే వయస్సు, ఒకే తండ్రి పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే బ్యాంకులో ఖాతా తెరిస్తే, ఆ ఖాతా వల్ల ఎలాంటి పరిణామం ఎదురైందో తెలుసా? 


అసలేం జరిగింది? 


చిత్తూరులోని‌ కరుమారియమ్మన్ ఆలయం వెనుక వీధిలో సెల్వరాజ్ నివాసం ఉంటున్నారు. ఇతడికి తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో రూ. 3 లక్షలు చేతిలో మిగిలాయి. వాటిని దాచుకునేందుకు చిత్తూరు పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బ్యాంకులో ఖాతా తెరిచారు. ఖాతా తెరిచి దాంట్లో డబ్బులు వేస్తే వడ్డీ రాదు కాబట్టి, తన వద్ద ఉన్న రూ. 3 లక్షల రూపాయల నగదును బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ చేశారు. ఫిక్సెడ్ డిపాజిట్ మెచ్యూరిటీ వచ్చే వరకు అదే బ్యాంకులో ఉంచాలని భావించారు. ఇదే పేరు, తండ్రి పేరు, వయస్సు కలిగి తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన మరొక వ్యక్తి అదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఖాతా తెరిచారు. 


మరో వ్యక్తి ట్రాన్స్ ఫర్ 


అయితే కొన్నాళ్లు కిందట అనారోగ్యంతో తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ మరణించాడు. సెల్వరాజ్ కుటుంబ సభ్యులు అతని ఖాతాలో ఉన్న నగదును పరిశీలించారు.  ఆ అకౌంట్లో దాదాపు రూ. 3 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. తండ్రి ఫోన్ లోని ఫోన్ ఫే ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కొన్నాళ్లు ఆ డబ్బును ఖర్చు పెట్టేసారు సెల్వరాజ్ పిల్లలు. గురువారం చిత్తూరుకు చెందిన సెల్వరాజ్ ఫిక్సెడ్ డిపాజిట్ కాలపరిమితి బుధవారం నాడే ముగిసింది. మెచ్యూరిటీ పొందిన డబ్బులను తీసుకొనేందుకు చిత్తూరు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లారు సెల్వరాజ్. తన ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బులను ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. అంతలోనే ఆయన ఖాతాలో నగదు మాయం అయింది. దీంతో బ్యాంకు అధికారులు రికార్డులను పరిశీలించగా ఆ వ్యక్తికి సంబంధించి డబ్బులను వేలూరుకు చెందిన సెల్వరాజ్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో చిత్తూరుకు చెందిన సెల్వరాజ్‌కు ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద డబ్బు ఇచ్చిన బ్యాంకు అధికారులు వేలూరుకు చెందిన సెల్వరాజ్‌ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.