Chinta Mohan On Chiranjeevi : తిరుపతికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ పదే పదే చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి ఈ అంసంపై మాట్లాడారు.  చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన చిరంజీవి  ప్రస్తావన ఎక్కువ తెస్తున్నారు. వారం రోజుల కిందట  మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్ అన్నారు.  తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని, పోటీకి దిగాలా వద్ద అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశమని  చెప్పుకొచ్చారు. 


ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. 130 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండదని, ఇండియా కూటమి లో ఉన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. కాకినాడ లోక్‌స‌భ స్థానం నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయాలని కోరుతున్నట్టు చింతామోహన్ వెల్లడించారు. ఏపీ రాజకీయాల్లో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయని.. ప్రజల్లో పరివర్తన కనిపిస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీటెక్‌లు పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ పార్టీని పార్టీని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ తన సొంత చెల్లెలితో గొడవల్ని సర్దుబాటు చేసుకోలేకపోయాడని చెప్పుకొచ్చారు. 


చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. 2017లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వశిష్ట్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతేడాది ఆయన నటించిన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు విడులయ్యాయి. అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పలు సందర్భాల్లో చిరంజీవి స్సష్టం చేశారు. అయినా చింతామోహన్ పదే పదే చిరంజీవి ప్రస్తావన  తీసుకు వస్తున్నారు. 


ఇటీవల షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో చేరిన వెంటనే ఆమెకు ఆ పదవి ఇవ్వడంపై కొంత మంది అసంతృప్తికి గురయ్యారు. మాజీ ఎంపీ హర్షకుమార్ నేరుగానే తన అభిప్రాయాన్ని చెప్పారు. చింతామోహన్ మాత్రం బయటపడలేదు కానీ.. గతంలో ఆయన కూడా ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఆశించారు. గతంలోనూ వైఎస్ కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేవు.  ఈ కారణంగా షర్మిలను వ్యతిరేకించడానికే ఆయన చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.