AP Latest News in Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం (జూన్ 12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు మంత్రి మండలి కూడా చంద్రబాబుతో పాటు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మంత్రివర్గంలో మొత్తం 24 మందికి చోటు కల్పించారు. 25 మంది మంత్రుల్లో మిత్ర పక్షాల నేతలకు కూడా సమన్యాయం పాటిస్తూ మంత్రి పదవులను కేటాయించారు. మొత్తం మంత్రుల్లో టీడీపీకి 21, జనసేనకు 3, బీజేపీకి ఒక్క మంత్రి పదవి కేటాయించారు.


డిప్యూటీ సీఎం జనసేన పవన్ కల్యాణ్ అని ప్రచారం జరగడం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. పవన్ కు ఏ శాఖ కేటాయించారు అన్నదానిపై స్పష్టత రాలేదు. జనసేన కనీసం 5 మంత్రి పదవులు ఆశించగా, మూడుకు పరిమితం చేశారు. బీజేపీకి రెండు మంత్రి పదవులు అని అంతా భావించగా, ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. అత్యధికంగా టీడీపీ నుంచి ఇరవైకి పైగా మంది మంత్రులు ఉండనున్నారు.


ఏపీలో కొత్త మంత్రుల జాబితా..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పి. నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ యాదవ్‌, ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌, ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి,  గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్‌, టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌,  కొండపల్లి శ్రీనివాస్‌, ఎస్‌.సవిత, మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులుగా నిలిచారు. 


మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొద్ది రోజుల క్రితమే కసరత్తు మొదలుపెట్టారు. కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించే మంత్రి పదవులు సహా.. వారిలో సీనియర్లు, సామాజికంగా సమతూకం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. నాదెండ్ల మనోహర్ కు కూడా కీలక శాఖ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 



ఎన్టీఏ కూటమి పార్టీల అభ్యర్థులు ఏపీలో 164 స్థానాల్లో గెలవడంతో.. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా కూడా అదే స్థాయిలో ఉంది. ముఖ్యంగా టీడీపీలో మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకొని వైసీపీపై పోరాడిన వారు చాలా మంది ఉన్నారు. వీరు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పదవుల కోసం చంద్రబాబును కలవాలని ప్రయత్నించినా.. అందరూ కలవలేకపోయారు. చంద్రబాబు ఎప్పుడు మంత్రివర్గ కూర్పు చేసినా పలువురితో వన్ టూ వన్ భేటీ అయ్యేవారు. ఈసారి బిజీ షెడ్యూల్ కారణంగా ఏ ఒక్కరితోనూ విడిగా భేటీ అవ్వలేదు. కేబినెట్ లో స్థానం కోసం పలువురు నేరుగా కలిసి చంద్రబాబుకు విన్నవించుకున్నప్పటికీ చంద్రబాబు పార్టీ నేతల సమక్షంలో ఉండగానే కలిశారు.


గవర్నర్ తో చంద్రబాబు భేటీ


మంగళవారం (జూన్ 11) సాయంత్రం చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఉదయం ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక కావడంతో సంబంధిత లేఖను చంద్రబాబు ఆయనకు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చంద్రబాబును ఆహ్వానించారు. రేపు ఉదయం చంద్రబాబు 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.