Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో హింస, నిరంకుశ పాలన, అరాచకాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇటవల తనపై తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో తనపై దాడులు జరిగాయని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, తనపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 


రాష్ట్రంలో వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులకు తెగబడుతోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి తనకు ఉన్న విశేషాధికారాలతో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్ర ఉత్రిక్తతలు ఏర్పడుతున్నాయని, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం జరుగుతోందని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులను వివరిస్తూ ఆయన 9 పేజీల లేఖ రాశారు.


ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొంటూ.. 2019లో జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన ‘విధ్వంసక పాలన’ను ఆవిష్కరించారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేశారని,  ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపారని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని తీవ్రంగా విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి తయారైందన్నారు. 


చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం జరిగిందని, తిరగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. 2019 ఆగస్టు నుంచి ఇటీవల అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులను లేఖలో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిందంటూ పేర్కొన్నారు.  రాష్ట్రంలో అశాంతి పెరిగిపోయిందని, తిరిగి శాంతి నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటూ తగు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిని ఆయన కోరారు. ఈ మేరకు 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్‌ను, వీడియోలను చంద్రబాబు పంపించారు.


ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లు లో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో A1‌గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమా, A3గా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు.


అలాగే పుంగనూరు పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పుంగనూరులో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనల్లో ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. పోలీస్ అధికారికి కంటి చూపు కూడా పోయింది. పోలీసులకు చెందిన పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు  200 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.