Nara Lokesh Education Dept: విద్యాసంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తుకు అసలైన పునాదులని, తాను నిన్నటి ఆలోచనను కాదని.. రాష్ట్రాన్ని నిలబెట్టే భవిష్యత్తు విజన్‌ను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  మెగా పేరెంట్-టీచర్ మీట్    కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, విద్యావ్యవస్థలో తాము తీసుకొచ్చిన మార్పులు , రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై  మార్గదర్శనం చేశారు.

Continues below advertisement

తన వయస్సు, నిరంతర శ్రమను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  60 ఏళ్లు రాగానే జీవితం ముగిసిపోయిందని భావించి చాలామంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ 76 ఏళ్ల వయసులోనూ పడుకునే సమయం తప్ప ప్రతి క్షణం యంత్రంలా పనిచేస్తున్నానంటే దానికి కారణం నాలోని సంకల్పమే. నేను గతం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తిని కాను, రేపటి తరాన్ని నిర్మించే భవిష్యత్తు విజన్‌ను అని సీఎం పేర్కొన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి డిజిటల్ విప్లవం వరకు గిరిజన విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం కావాలనేది తన ఆశయమని తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో లోకేష్ ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నారు. ఆనాడు ఈ శాఖను ఎందుకు అడిగారో ఈరోజు నాకూ, రాష్ట్ర ప్రజలకూ స్పష్టంగా అర్థమైంది. విద్యావ్యవస్థలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల పురోగతిని పర్యవేక్షించే క్రమాన్ని వివరిస్తూ..  మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కు మార్కులు తగ్గుతాయి! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి మార్కులు వేస్తే.. విద్యాశాఖ మంత్రిగా పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రిగా నేను లోకేష్‌కు మార్కులు వేస్తా  అని చమత్కరించారు. 

Continues below advertisement

గిరిజన ప్రాంత పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు  తల్లికి వందనం ,  లీప్ యాప్ వంటి సాంకేతిక వినూత్న విధానాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను వెలికితీసేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై రోజూ దృష్టి సారించాలని సూచించారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా 16,000 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి, విద్యావ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చామని గుర్తుచేశారు.  

అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు విద్యాశాఖ అమలు చేస్తున్న  డొక్కా సీతమ్మ  మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి ఆస్వాదించారు. లబ్ధిదారులైన  తల్లికి వందనం తల్లిదండ్రులతో నేరుగా ముచ్చటించి పథకాల అమలుపై వారి అభిప్రాయాలు సేకరించారు. విద్యార్థులు నాటిన మొక్కలకు జారీ చేసిన  గ్రీన్ పాస్‌పోర్టులు , క్యూఆర్ కోడ్‌లను సీఎం పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను దేశానికే ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.