Chandrababu On power Sector: దేశంలో తొలి సారి విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది తానేనని అలా చేసినందుకు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడని విమర్శించారన్నారు. అయితే తాను చేసిన పని వల్ల విద్యుత్ రంగం మెరుగుపడిందని అసెంబ్లీలో  పవర్ సెక్టర్ పై చర్చలో చంద్రబాబు ప్రసంగించారు.. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లోనే గాడిన పెట్టాం. గత పాలకుల విధ్వంసం వల్ల ఆ రంగంలో వ్యవస్థలో అంతుబట్టని సమస్యలు ఉన్నాయన్నారు.  క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దీని ద్వారా రాష్ట్రంలోని 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యంమని చంద్రబాబు తెలిపారు. 


విద్యుత్ రంగంలో సంస్కరణల ఫలితాలు 


విద్యుత్ రంగంలో  30 ఏళ్లకు ముందు ఉన్న వ్యవస్థను చూశాను...ఇప్పుడున్న వ్యవస్థను చూస్తున్నాను. 2004కు ముందు మేం అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్షాలు వెళ్లి విద్యుత్ సౌధ వద్ద ఆందోళనలు చేసేవి. నేను అసెంబ్లీ నుంచి బటయకు వెళ్లి పొలాలు చూసి వచ్చి మళ్లీ సభ్యులకు సమాధానం చెప్పేవాడ్నన్నారు. . గతంలో గ్రామాల్లో కరెంట్ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఇక రైతులు అయితే కరెంట్ రాగానే రైతులంతా ఒకేసారి మోటార్లు వేసేవారు. లో ఓల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయేవి. నేను 2012లో పాదయాత్ర చేశాను. కొన్నిచోట్ల రైతులు చలిమంట వేసుకుని కరెంట్ కోసం కూర్చునేవారు. ఏంటి ఇక్కడ కూర్చున్నారని అడిగితే కరెంట్ కోసం చూస్తున్నామని చెప్పారు. చాలా మంది రైతులు పాముకాటుకు గురయ్యేవారు. ఇవన్నీ చూశాక 2014లో అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ పగటిపూటే ఇచ్చామని గుర్తుచేశారు. 


ప్రపంచబ్యాక్ జీతగాడ్నని అన్నారు. 


వసాయానికి ఎంతోకొంత రైతుల నుంచి వసూలు చేసేవారు. మేం వచ్చాక స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్నాం. దీంతో మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. ప్రపంచమంతా అధ్యయం చేశాను. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే. అప్పుడు నన్ను ప్రతిపక్షాలు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు. అయినా ప్రజలకోసం, రాష్ట్రంకోసం ఆ మాట పడ్డాను. 1995లో 10 నుంచి 15 గంటలదాకా విద్యుత్ కోతలు ఉండేవి. 1998లో సంస్కరణలు దేశంలోనే మొట్టమొదటి సారి తెచ్చాం. ఎనర్జీ ఆడిటింగ్ విధానం తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్ మిషన్ కమిటీలుగా విభజించాం. కరెంట్ కొరతలను 2004 నాటికి అధిగమించాం. కరెంట్ కొరతలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. ఆ ఫలితాలు చూసి సంతోషించా. కానీ అవి ప్రజలకు అర్థంకాకపోవడం 2004లో ఓడిపోవడానికి కారణం అయింది. రాష్ట్రానికి లాభాలు వచ్చాయి...నాకు కష్టాలు వచ్చాయని చమత్కరించారు. 


ఒక వ్యక్తి అహం వల్ల రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది


2014లో అధికారంలోకి వచ్చాక మళ్లీ విద్యుత్ అంశంపై స్టడీ చేశాం. 22.5 మిలియన్ల కొరత ఉంటే సవాల్‌గా తీసుకుని 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. జాతీయ తలసరి వినియోగం 17 శాతం ఉంటే మనం 23 శాతానికి పెంచాం. సోలార్, విండ్ ద్వారా 7,700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాం. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు. ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ అందించాం. 2019-24లో మధ్య మల్లీ చీకటి రోజులు వచ్చాయి. అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేశారనడానికి ఇదొక కేస్ స్టడీ. విద్యుత్ రంగాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టారు. ఏ రాష్ట్రంలోనైనా పీపీఏల ఆధారంగా పెట్టుబడులు పెడతారు. దావోస్‌లో కూడా పీపీఏల రద్దుపై చర్చలు జరిగాయి. వితండ వాదంతో కావాలని అవినీతి ఆరోపణలు చేసి సోలార్ విద్యుత్ వాడలేదు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రూ.9 వేల కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఆనాడు కరెంట్ వాడుకుని ఉంటే మనకు సమస్యలు వచ్చేవి కాదు. ఒక అహంకారం వల్ల రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. 


గత ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు


నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన నాకే విద్యుత్ చార్జీల్లో పెట్టిన  రకరకాల పేర్లు అర్థం కాలేదని చంద్రబాబు చెప్పారు. ఫ్యూయల్ సర్‌ఛార్జీ , ట్రూఅప్ ఛార్జీలు , ఎలక్ట్రిసిటీ డ్యూటీ ల పేరుతో కోట్లు వసూలు చేశారన్నారు.  నేనున్నప్పుడు 6 పైసలువేస్తే అది కూడా విద్యుత్ బోర్డే తీసుకునేది. 2019-24 మధ్య 9 సార్లు ఛార్జీలు పెంచి రూ.32,166 కోట్లు భారం వేశారు.  గత ప్రభుత్వం పెంచిన ఛార్జీల భారం గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రజలపై పడింది. పవర్ సప్లై అగ్రిమెంట్, సెకీలు భారంగా అయ్యాయి. కానీ సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే ఫినాల్టీలు కట్టడంతోపాటు, విశ్వతనీయత పోతుంది. అయినప్పటికీ వీటన్నింటినీ సాకుగా చూపి తప్పించుకోవడానికి సిద్ధంగా లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 


ప్రతి నియోజవర్గంలో 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటు 


భూతాపం పెరిగుతోంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ, హైడల్, రెన్యూవబుల్, బ్యాటరీ విద్యుత్ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. కరెంట్‌ను ఇళ్లు, పరిశ్రమలు, వాహనాలకు వాడుతున్నాం.  సస్టెయినబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ వినియోగం తప్ప మరో మార్గం లేదు. రాబోయే రోజుల్లో విమానాలు, ఓడలు కూడా గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రాబోతున్నాయి. ఎనర్జీని ఎగుమతికి ఉపయోగించుకోబోతున్నాం. 500 గిగా వాట్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు అందులో మనం 160 గిగావాట్లు టార్గెట్ పెట్టుకున్నాం. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజీలీ యోజన్ కింద ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్యఘర్ కింద 2 కిలో వాట్‌ల విద్యుత్ ఉత్పత్తికి రాయితీ అందిస్తామన్నారు.  140 యూనిట్లు గ్రిడ్‌కు విక్రయిస్తే ఒక్కో కుటుంబానికి రూ.300 ఆదాయం వస్తుంది. నిర్వహణకు కూడా ఏజన్సీని పెడతాం. 3 కిలో వాట్స్‌కు రూ.78 వేలు సబ్సీడీ వస్తుంది. మిగతా 70 వేలకు అవసరమైతే పెట్టుబడి ప్రభుత్వమే పెడుతుంది, లేదంటే బ్యాంకు ద్వారా రుణం అందిస్తామని హామీ ఇచ్చారు. 


పీఎం కుసుమ్ కింద 4 లక్షల పంపుసెట్లు


పీఎం కుసుమ్ కింద లక్ష వ్యవసాయ పంపుసెట్లను కేంద్రం కేటాయించింది. మనం మరో 4 లక్షల సోలార్ పంపుసెట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరామని చంద్రబాబు తెలిపారు.  బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రం ఇస్తోంది. 1000 మెగావాట్లకు రూ.270 కోట్లు వీజీఎఫ్ కేంద్రం ఇస్తోంది. జమ్మలమడుగు, ఘనిలో 225-450 మెగావాట్లు చొప్పున, కుప్పంలో 50-100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ కోసం ఎంపిక చేశాం. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ స్టోరేజీ ఖర్చు ఎక్కువ అవుతుంది. కరెంట్ చార్జీలు ఎందుకు పెరుగుతున్నాయనుకున్నందుకు 2014 నుంచి 2018 వరకు రూ.4.40 సగటు యూనిట్ కాస్ట్ అవుతోంది. 2019 నుంచి 24 వరకు సగటున యూనిట్ కొనుగోలుకు రూ.6.90 అయింది. ఈ భారం ప్రజలే మోస్తున్నారు. 


రాష్ట్రంలో 5 వేల ఈవీ స్టేషన్‌లు


ఎలక్ట్రిటిక్ వాహనాల వినియోగంలో వెనకబడి ఉన్నాం. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 30 కి.మీ ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున మొత్తం 5 వేల స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా 26.26 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాబోయే ఐదేళ్లలో జెన్‌కో ద్వారా రూ.1.07 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేసి మనకు కావాల్సిన విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేందుకు ముందుకెళ్తున్నాం. ట్రాన్స్ మిషన్ కెపాసిటీని 16,507 మెగావాట్లకు పెంచుతాం. దీనికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు తెలిపారు.