Chandrababu Naidu On Jagan:  అసెంబ్లీకి రావాలంటే జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన డిమాండ్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే సరిపోదని, అది ప్రజలు ఎన్నికల ద్వారా ఇచ్చే హక్కు అని స్పష్టం చేశారు.  “ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే ఇచ్చేస్తామా? ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగినా ఇచ్చేస్తామా? ఏ హోదా అయినా ప్రజలు ఇస్తారు,” అని  చంద్రబాబు అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం రాజ్యాంగ నిబంధనలు ,  ప్రజాతీర్పు కీలకమని వివరించారు.         

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశం ఇటీవలి సమావేశాల్లో వివాదాస్పదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, 175 స్థానాలున్న అసెంబ్లీలో 11 సీట్లతో  ఏకైక ప్రతిపక్ష పార్టీగా  ఉన్నామని, ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.   ప్రతిపక్ష హోదా కోసం కనీసం 10% సీట్లు  అంటే 18 సీట్లు ఉండాలనే రాజ్యాంగ నిబంధనను వైసీపీ అందుకోలేదని అంటున్నారు. “ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే సరిపోదు. ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగినా ఇవ్వలేం. ఏ హోదా అయినా ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారు. వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారు. జనసేనకు 21 సీట్లు లభించాయి. ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి హోదా గురించి మాట్లాడే హక్కు ఉండేది,” అని అన్నారు.           

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సాధారణంగా రెండో అతిపెద్ద పార్టీకి  ఇస్తారు.   కనీసం 10% సీట్లు ఉండాలనే నిబంధన వైసీపీకి అడ్డంకిగా మారింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో అధికారంలో ఉంది.  జనసేన 21 సీట్లతో రెండో స్థానంలో ఉంది. వైసీపీ ఈ హోదా కోసం  కోర్టుకు వెళ్లింది. స్పీకర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రజాతీర్పును గౌరవించాలని, రాజ్యాంగ నిబంధనలను అనుసరించాలని సూచించారు.                     

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పి వైసీపీ సభ్యులెవరూ  రావడం లేదు. ప్రజా సమస్యల కోసం అసెంబ్లీని వాకౌట్ చేసిన వారిని చూశాం కానీ ఇలా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని మొత్తంగా తన పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నరాని జగన్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబును నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ హెచ్చరించారు.  అవే మాటలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడెలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని  ప్రశ్నిస్తున్నారు.