Chandrababu Naidu announces Veligonda project to be launched in June:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మార్కాపురం జిల్లాలో పర్యటించారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన పూల సుబ్బయ్య  వెలిగొండ ప్రాజెక్టు కు సంబంధించి కీలకమైన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద సుమారు రూ. 456 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Continues below advertisement

అనంతరం మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ  ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసి, పనులు పూర్తికాకుండానే రిబ్బన్ కటింగ్ చేసి ప్రజలను మోసగించిందని ఆయన విమర్శించారు. ఫీడర్ కాలువ పటిష్టతపై దృష్టి పెట్టకపోవడం వల్ల అనేక చోట్ల గండ్లు పడి ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడిందని, అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేసి యుద్ధప్రతిపాదికన పనులు చేపడుతోందని వివరించారు.

వెలిగొండ ప్రాజెక్టును తన మానస పుత్రికగా అభివర్ణించిన చంద్రబాబు, 1996లో తాను ఇచ్చిన హామీ మేరకే దీనికి శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు.  వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను ఒక సవాల్‌గా స్వీకరిస్తున్నాను  అని ఆయన ప్రకటించారు. ఆగస్టు 2026 నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలను మళ్లించడమే తమ లక్ష్యమని, దీని కోసం సుమారు రూ. 2,000 కోట్లు అవసరమవుతాయని అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి.. ఆ తప్పునుహెరిటెజ్ పై రుద్దేందుకుప్రయత్నిస్తున్నారని జగన్, వైసీపీ తీరుపై మండిపడ్డారు.    

Continues below advertisement

పర్యటనలో భాగంగా జిల్లా అభివృద్ధిపై పలు వరాలు కురిపించారు. మార్కాపురం ప్రాంతాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అయిన ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టేందుకు రక్షిత మంచినీటి పథకాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొత్త జిల్లాగా ఏర్పడిన మార్కాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతానికి సాగునీరు అందించి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు రాకతో మార్కాపురం జిల్లా కేంద్రం పసుపుమయంగా మారింది. జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, రైతులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.