Chandrababu: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికి రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో జమ చేశామన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే, 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. జరుగుతున్న పనులను సమీక్షించారు. అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
పోలవరం రాజెక్టు కట్టాలని 1941లోనే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. అప్పుడు ప్రాజెక్టు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి .. 400 టీఎంసీలు వాడుకుంటే ఏపీని కరవు రహితం చేయవచ్చన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు .. ప్రాజెక్టును చేయగల్గుతామనే ధీమాతో ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. ఏడు మండలాలు తెలంగాణాలో ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేది కాదన్నారు. ఏడు మండలాలు ఏపీకి ఇవ్వడం ప్రాజెక్టుకు దోహదమైందన్నారు.
2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును 73 శాతం పూర్తి చేశామని.. పోలవరం పై 82 సార్లు వర్చువల్ గా సమీక్షించానని తెలిపారు. పోలవరం ఆలస్యమవుతుందని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని.. ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పు...చరిత్ర క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టు....ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షతో ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్నారు. గతంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది కూడా ఎవరికీ తెలియదని.. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఊహించని నష్టం జరిగింది...ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పీపీఏ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పినా పట్టించుకోలేదని.. ఒకసారి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం విషయంలో నిపుణుల కమిటీ పరిశీలించిందని.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ కక్షతో రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టు పై కక్ష తీర్చుకున్నారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతోందని.. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 డిసెంబర్ కు పూర్తయ్యేలా ఉందన్నారు. డిసెంబర్ 31 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం.. - ఇతర పనులన్నీ డిసెంబర్ 26 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఎడమవైపు అనుసంధానం జూన్ 26 నాటికి పూర్తి చేస్తామని.. కుడివైపు అనుసంధానాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. ఫిబ్రవరి 26 నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1 డ్యామ్ పూర్తి చేస్తాం .. 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 డ్యామ్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.