CM at IIT Madras: ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన రీసెర్చ్ స్కానర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భవిష్యత్ భారతీయులదేనని మద్రాస్ ఐఐటీ నుంచి వస్తున్న పట్టభద్రులు ఏర్పాటు చేస్తున్న స్టార్టప్స్ సక్సెస్ రేటు 80 శాతం ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో నలభై శాతం వరకూ తెలుగు విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. అగ్నికుల్ స్టార్టప్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఐఐటీ మద్రాస్ లో ప్రసంగించేందుకు చంద్రబాబు చెన్నై వెళ్లారు. ఈ సమావేశానికి చంద్రబాబు రాకతోనే అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. చంద్రబాబు పరిచయ ప్రసంగాన్ని నిర్వాహకులు చదువుతున్నప్పుడు.. చప్పట్లతో ఆడిటోరియం హోరెత్తింది. విద్యార్థులు పలు అంశాలపై చంద్రబాబును ప్రశ్నించారు జనాభా పెంచాలని ఇస్తున్న పిలుపు విషయంలో చంద్రబాబు మాట్లాడారు. "పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, భార్యా భర్తలమిద్దరం పనిచేస్తాం, డబుల్ ఆదాయం వస్తుంది, నో కిడ్స్, లెటజ్ ఎంజాయ్" అనే తీరుకొస్తున్నారని అదుకే జనాభా సమస్య వస్తుందని.. ఎదురుగా ఉన్న యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనాభా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పిల్లల్ని కనాలన్నారు.
సీఎంగా ఉన్నప్పుడు విద్యారంగంలో తెచ్చిన మార్పులను గురించి కూడా ప్రస్తావించారు. ఒకప్పుడు ఇరవై హై స్కూళ్ళు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో నేడు వందకు పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని గుర్తు చేశారు. అదే రంగారెడ్డి జిల్లా నేడు జాతీయ స్థాయిలోనే తలసరి ఆదాయం విషయంలో ప్రథమ స్థానంలో ఉందిన్నారు. విద్యారంగం అభివృద్ది చెందితే ఉపాది అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. తాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, మన దేశంలో ఏ కాలేజీకి వెళ్లినా మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు.. నేను భారతీయుడిగా తెలుగు వాడిగా గర్వపడుతున్నానన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎవరి పాత్ర ఏమిటన్నది గూగుల్ ను అడిగితే చెబుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఓ విద్యార్తి చంద్రబాబు చేతికి ఉన్న ఓ రింగ్ గురించి ప్రస్తావించారు. అలాంటి నమ్మకాలు ఉన్నాయా అన్నట్లుగా ప్రశ్నించడంతో చంద్రబాబు సమాధానం ఇచ్చారు. చాలామంది అనుకుంటున్నట్టు నా చేతి రింగ్ పూజారి ఇచ్చింది కాదని.. ఆరోగ్యం విషయంలో నన్ను అలర్ట్ చేసే స్మార్ట్ రింగ్ అని గుర్తు చేశారు.
చంద్రబాబును ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రసంగాలకు ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటాయి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే ముస్సోరి క్యాంపస్ నుంచి కూడా చంద్రబాబుకు ఆహ్వానాలు వస్తూంటాయి. పలుమార్లు అక్కడ ప్రసంగించారు. దేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు అయిన చంద్రబాబు.. వ్యవస్ధల మెరుగుదల కోసం తన అనుభవాలను వివరిస్తూ ఉంటారు. చంద్రబాబు మద్రాస్ ఐఐటీలోకి వచ్చి .. వెళ్లే వరకూ ఆయనకు యవతలో ఉన్న క్రేజ్ కనిపిస్తూనే ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.